IND vs PAK: హాట్ కేక్: రూ.19,00,000 పైగా పలికిన టికెట్లు
అహ్మదాబాద్: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌ను ఆడుతోంది. ఇందులో పల్లెకెలె స్టేడియంలో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన నేపాల్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్.. సూపర్ 4లో అడుగు పెట్టగలుగుతుంది.
దీని తరువాత టీమిండియా ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌కు సన్నద్ధమౌతుంది. అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన.

ఈ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. అక్టోబర్ 14వ తేదీన ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. దీని తరువాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌లతో తలపడుతుంది. నెదర్లాండ్స్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్.. లీగ్ దశలో చిట్ట చివరిది. నవంబర్ 12వ తేదీన ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఆ తరువాత నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
భారత్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. బుక్ మై షో ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ మీద అమ్మకానికి ఉంచిన ఆరు గంటల వ్యవధిలోనే మొత్తం టికెట్లన్నీ విక్రయం అయ్యాయి. టికెట్లు కంప్లీట్‌గా బుక్ కావడం వల్ల ముందుగా కొనుగోలు చేసిన వారు వాటిని రీసేల్‌కు పెట్టారు.
తాము కొన్న టికెట్లను వయాగొగొ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ మీద రీసేల్‌కు పెడుతున్నారు. ఆక్షన్‌ను నిర్వహిస్తోన్నారు. ఇది వారికి కాసుల పంటను పండిస్తోంది. సౌత్ ప్రీమియం వెస్ట్‌బే సైడ్‌లో అత్యధికంగా ఒక టికెట్ 19 లక్షల రూపాయలు పలకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌కు అద్దం పడుతోంది.

వయాగొగొ ప్లాట్‌ఫామ్‌పై ఇంకా వంద టికెట్లు రీసేల్‌లో ఉన్నాయి. దీనిపై న్యూస్ 18 ఇంగ్లీష్ వెబ్‌సైట్ ఎక్స్‌క్లూజివ్‌గా ఓ కథనాన్ని ప్రచురించింది. వయాగొగొలో టికెట్ల ధర 66,000 నుంచి మొదలై 19,00,000 కంటే అధిక ధర పలికినట్లు క్రికెట్‌నెక్స్ట్ వెల్లడించినట్లు తెలిపింది.
అక్టోబర్ 5వ తేదీన నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ కోసం సౌత్ ప్రీమియం వెస్ట్ బేలో లభించే టికెట్ ధర 6,000 రూపాయల వరకు ఉంటోంది. 1,000, 1,500, 2,000, 3,000ల నుంచి టికెట్లు లభ్యమౌతోన్నాయని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. భారత్-పాక్ మధ్య మ్యాచ్‌కే అత్యధిక డిమాండ్ ఉన్నట్లు అంచనా వేసింది.












Click it and Unblock the Notifications