బీసీసీఐ ప్రపోజల్స్‌పై తేల్చేసిన పాకిస్తాన్
ముంబై: ఐసీసీ వరల్డ్ కప్.. ఇంకో మూడు నెలల్లో ఈ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ ఆరంభం కాబోతోంది. దీనికోసం క్రికెట్ ఆడే అన్ని దేశాలు సన్నద్ధమౌతోన్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌తో తీరిక లేని షెడ్యూల్స్‌ను ఎదుర్కొంటోన్నాయి. ఇది 13వ ఎడిషన్ వరల్డ్ కప్. ఇప్పటివరకు 12 మెగా టోర్నమెంట్లు ముగిశాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక అయింది.

ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఈ మ్యాచ్ అక్టోబర్ 15వ తేదీన జరగాల్సి ఉంది. ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 15వ తేదీన జరిగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రీపోన్ అయింది. 15వ తేదీకి బదులుగా 14వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. అంటే ఈ రెండు దేశాల మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే జరుతుంది.
దీనికి కారణం లేకపోలేదు. అక్టోబర్ 15వ తేదీన దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 15వ తేదీన దసరా పండగ తొలి రోజు కావడం వల్ల ఈ మ్యాచ్‌ను ప్రీపోన్ చేసింది బీసీసీఐ. దసరా తొలి రోజు నాడు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు వెళ్తుంటారు. అదే రోజున షెడ్యూల్ కావడం వల్ల మ్యాచ్‌ను చూసే వారి సంఖ్య తగ్గుతుందని బీసీసీఐ భావిస్తోన్నట్లు తెలుస్తోంది.
ఈ మార్పును పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అంగీకరించింది. అదే సమయంలో- భారత్‌తో మ్యాచ్‌కు ముందు తగినంత విశ్రాంతి తీసుకోవాల్సిన ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ కొన్ని సూచనలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు పంపించింది. శ్రీలంకతో అక్టోబర్ 12వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌ను ముందుకు జరపాలని విజ్ఞప్తి చేసింది. అంటే అక్టోబర్ 12వ తేదీకి బదులుగా 10వ తేదీ నాడే షెడ్యూల్ చేయాలని కోరింది.
12వ తేదీన శ్రీలంకతో మ్యాచ్ ఆడిన ఒక్కరోజు వ్యవధిలో టీమిండియా ఎదుర్కొనాల్సి రావడం వల్ల తమ జట్టు ప్లేయర్లపై ఒత్తిడి పడుతుందని పీసీబీ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా.. దాని ప్రభావం భారత్‌తో 14వ తేదీన జరిగే మ్యాచ్ ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు ఐసీసీకి తన ప్రతిపాదనలను పంపించింది.
శ్రీలంకను ఢీ కొట్టే మ్యాచ్‌లో ఒకవేళ పాకిస్తాన్‌కు ఓటమి ఎదురైతే.. దాని దుష్ప్రభావం భారత్‌తో జరిగే గేమ్‌పైనా పడొచ్చనేది పీసీబీ వాదన. అందుకే శ్రీలంకతో జరిగే మ్యాచ్‌ను 12వ తేదీకి బదులుగా 10వ తేదీకి షెడ్యూల్ చేయాలని కోరినట్లు చెబుతున్నారు. దీనికి ఐసీసీ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications