దుబాయ్: షాపింగ్ ఉత్సవంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమం డ్రాలో భాగంగా భారత్‌కు చెందిన నాలుగేళ్ల బాలిక అరకిలో బంగారం గెలుపొందింది. దుబాయ్ షాపింగ్ ఉత్సవంలో ప్రస్తుతం కొనసాగుతున్న లక్కీ బ్యాగ్ డ్రాలో జేస్ ఎల్మా మాథ్యూ ఈ అదృష్టం దక్కింది. అమ్మాయి తండ్రి సాజు మాథ్యూ బంగారు నగలను కొనుగోలు చేసినందుకు ఇచ్చిన కూపన్లపై తన కుమార్తె పేరు రాశారు. దుబాయ్ షాపింగ్ ఉత్సవంలో బంగారం గెలుపొందడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జేస్ అయితే మరీ సంతోషంగా ఉంది అని సాజు చెప్పారు.
ఈ బంగారాన్ని జేస్ పెళ్లికోసం దాచాలని ఆమె తల్లి ఎల్మా భావిస్తున్నారు. కాగా వచ్చేనెల 20వ తేదీ వరకు జరిగే ఉత్సవంలో దుబాయ్ బంగారం, నగల గ్రూప్ తన ఖాతాదారులకు 21 కిలోల బంగారం గెలుపొందే అవకాశం కల్పిస్తోంది.