ఆడికారులో ఉండగా కాల్పులు.. కెనడాలో భారత విద్యార్థి మృతి
కెనడాలోని సౌత్ వాంకోవర్‌లో చిరాగ్ అంటిల్ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు తన ఆడి కారులో ఉండగా దుండగులు కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి చిరాగ్ మృతి విషయాన్ని సౌత్ వాంకోవర్ పోలీసులు ధృవీకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పుల శబ్ధం వినిపించినట్లు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఈస్ట్ 55 అవెన్యూ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్లి చూడగా.. కారులో చిరాగ్ విగత జీవిగా పడివున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవర్నీ అరెస్ట్ చేయలేదు అని వాంకోవర్ పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, చిరాగ్ హర్యానాకు చెందిన వ్యక్తి. అతని మృతదేహాన్ని భారత్ కు తీసుకుచ్చేందుకు క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నట్లు అతడి సోదరుడు రోహిత్ అంటిల్ స్థానిక మీడియాకు తెలిపారు. చిరాగ్ హత్యకు గురైన ఘటనపై కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు వరుణ్ ఛౌదరీ ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తును సమగ్రంగా జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని విదేశీ వ్యవహారాల శాఖకు విజ్ఞప్తి చేశారు.
ఆస్ట్రేలియాలో దారుణ ఘటన
ఆస్ట్రేలియా సిడ్నీలోని వెస్ట్ ఫీల్డ్ బోండి జంక్షన్ షాపింగ్ సెంటర్లో ఏప్రిల్ 13న పలువురిపై కత్తితో దాడికి పాల్పడి, కొందరి మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు మట్టుబెట్టారు. దుండగుడి దాడిలో ఓ చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. నిందితుడొక్కడే కత్తి దాడికి పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడి వివరాలు తెలియాల్సి ఉందన్న అధికారులు, కత్తి దాడులకు పాల్పడటానికి గల కారణంపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు, అమెరికాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇల్లినాయీస్ రాష్ట్రంలోని జోలియెట్ పట్టణంలో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడని టెక్సాస్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications