అమెరికా వీసా సంస్కరణలపై భారత్ హెచ్చరిక

అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలు మన దేశ నిపుణులైన కార్మికులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని జయశంకర్ తెలిపారు. అంతేగాక అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదకరమేనని, ఇరు దేశాల సంబంధాలు కూడా ఈ ఆంక్షల వల్ల దెబ్బతినే అవకాశముందని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయశంకర్ అభిప్రాయపడ్డారు. తాను ఈ నిర్ణయం పట్ల సానుకూలంగా లేనని చెప్పారు.
విదేశాల నుంచి వచ్చి అమెరికాలో నివసిస్తున్న 11 మిలియన్ల ప్రజలకు లీగల్ స్టేటస్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్న చట్టసభ సభ్యులు, వలసదారుల కోసం కొత్త వీసా నిబంధనలను రూపొందిస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీల నుంచి అడ్వాన్స్‌డ్ సైన్స్ డిగ్రీలను పొందిన విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలోని సెనెట్ ఇమ్మిగ్రెంట్ వీసాలను ఆఫర్ చేస్తోంది. కాగా అదే సమయంలో తాత్కాలికంగా అమెరికాకు వచ్చే నైపుణ్యం కలిగిన కార్మికులకు ఇచ్చే హెచ్-1బి వీసాల నిబంధనలను మార్పు చేస్తోంది.
ఈ నిబంధనల కారణంగా హెచ్-1బి వీసాల కోసం ఎక్కువ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేగాక విదేశీ కంపెనీలు అమెరికాకు పంపించే నైపుణ్యం కలిగిన కార్మికులకు అందించే వీసాల సంఖ్యపై కూడా ఆంక్షలను విధిస్తోంది. అమెరికాలోని భారత కంపెనీలు తమ దేశానికి చెందిన కార్మికులను తీసుకువచ్చి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని, దీని వల్ల తాము అవకాశాలు కోల్పోతున్నామని అమెరికాలోని వ్యాపార వర్గాలు, కార్మిక వర్గాలు ఫిర్యాదు చేయడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ నిర్ణయం భారతీయ ఐటి కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థకు వారు తోడ్పాటునందిస్తున్నారని జయశంకర్ చెప్పారు. అమెరికా ప్రభుత్వం వీసా ఆంక్షలను అమలు చేసే ముందు ఒకసారి పునర్ సమీక్షించాలని, లేదంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ చర్యతో అమెరికాలో సంస్థలను కలిగి ఉన్న ఇతర దేశాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications