ముగిసిన మూడు రోజుల లండన్ పర్యటన.!హైదరాబాద్ కు పయనమైన కల్వకుంట్ల కవిత.!
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మూడు రోజుల లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ కు పయనమయ్యారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం మేరకు లండన్ వెళ్లిన కవిత పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్లు - ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల పాత్ర అనే అంశంపై ఆ సంస్థ నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. లండన్ లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. అదే విధంగా నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని - యుకే ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

లండన్ లో మూడు రోజుల పాటు కవిత..
సీఎం చంద్రశేఖర్ రావు పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న కవిత నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్ - యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం, రాజకీయాల్లో మహిళల పాత్ర, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ ప్రయాణం వంటి వాటిపై ఆమె తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు.

ఎన్నో ఫలితాలిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే..
తెలంగాణ ఏర్పడిన వెంటనే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించామని, దాని వల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలను సేకరించామని తెలిపారు. ప్రజలను పైకి తేవడానికి ప్రస్తుతం ఆ వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కులవృత్తుల వారికి చేయూత అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఉదాహరణకు చెరువులు మరమ్మత్తు చేసి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు సంభవించిందని వివరించారు.

అణగారిన వర్గాల ఆర్థిక పరిపుష్టి కోసమే దళిత బంధు..
దళిత బంధు వంటి పథకాల వల్ల ఆ వర్గాల్లో ఆర్థిక శక్తి పెరిగిందని, ఆ వర్గాల వారు పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదిగాయని చెప్పారు. వ్యవస్థీకృత డెలివరీలను ప్రోత్సహించడానికి గానూ శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు కేసీఆర్ కిట్ లు పంపిణీ చేస్తున్నామని, గర్భిణీ సమయంలోనూ నెలకు రూ. వెయ్యి ప్రభుత్వం అందిస్తోందన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు వచ్చాయని అన్నారు. క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం అందించిన ప్రోత్సహంతో సాంఘీక సంక్షేమ పాఠశాలలో చదివే మాలవత్ పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిందని ప్రస్తావించారు.

మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన..
మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని తెలిపారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55-57 శాతం మహిళా ప్రజాప్రతినిధేల ఉన్నారని, కానీ సమావేశాలు నిర్వహిస్తే ఎక్కువ పురుషులు కనిపిస్తారని, ఆ పరిస్థితి మారాలని స్పష్టం చేశారు. ఆ దిశగా బీఆర్ఎస్ కృషి చేస్తుందని, మార్పు సాధ్యమని ఆశిస్తున్నానన్నారు. మరోవైపు, మహిళా భద్రత గురించి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, షీ టీమ్స్ ఏర్పాటు చేసిందని చెప్పారు. తన లండన్ పర్యటనను ముగించుకొని సోమవారం నాడు హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. లండన్ విమానాశ్రయంలో బీఆర్ఎస్, భారత్ జాగృతి కార్యకర్తలు మరియు ప్రవాస భారతీయులు ఆమెకు వీడ్కోలు తెలిపారు.












Click it and Unblock the Notifications