‘ఎన్నారై భార్య’ శోకం: విదేశాల్లో తెలుగు మహిళల ఆర్థనాదాలు, ప్రతీ 8గంటలకో ఫిర్యాదు
వాషింగ్టన్/హైదరాబాద్: విదేశాల్లో ఉండే భారతీయ యువకులతో తమ కుమార్తెలకు వివాహం చేసేందుకు దేశంలోని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన తల్లిదండ్రులు ఎక్కువగా పోటీపడుతుంటారు. కానీ, వాస్తవం తెలిస్తే మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎందుకంటే.. ఎన్‌ఆర్‌ఐ పెళ్ళిళ్లు చేసుకున్న అమ్మాయిలకు కన్నీళ్లు మిగుల్చుతున్న ఉదంతాలు గత కొంత కాలంగా పెరిగిపోతున్నాయి. సగటున ప్రతి ఎనిమిది గంటలకు ఎన్‌ఆర్‌ఐని వివాహం చేసుకున్న ఓ మహిళ సాయం కోసం తమవారికి ఫోన్ చేస్తున్నట్టు గణాంకాలు వెల్లడించాయి.

మానసిక, శారీరక వేధింపులు
భర్త వదిలివేయడమో, మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడమో..వంటి పలు కారణాలతో తాము తిరిగివస్తామంటూ పేరెంట్స్‌ను వేడుకుంటున్నట్టు తేలింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు జనవరి 1, 2015 నుంచి నవంబర్ 30, 2017 మధ్య ఈ తరహా ఫిర్యాదులు 3,328 వరకూ అందడం గమనార్హం.

రెండో స్థానంలో ఏపీ, తెలంగాణ
కాగా, ఈ ఫిర్యాదులు అధికంగా పంజాబ్ నుంచి రాగా, ఆ తర్వాతి స్ధానాల్లో ఏపీ, తెలంగాణ, గుజరాత్‌లున్నాయి. ఇక వరకట్న వేధింపులు అధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే వస్తున్నాయని వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఆరతిరావు తెలిపారు. వరకట్న వ్యవస్థ బలంగా ఉన్న ఏపీ, తెలంగాణలోనే ఈ పరిస్థితి అధికంగా ఉందని చెప్పారు.

అదనపు కట్నం, గొంతెమ్మ కోరికలు
ఎన్‌ఆర్‌ఐలు తమ స్వస్థలాలకు వెళ్లి తల్లితండ్రులు చూసిన అమ్మాయిలను పెళ్లిచేసుకుంటున్నారని.. అయితే తిరిగి వచ్చిన తర్వాత వారితో కలిసిఉండేందుకు విముఖత చూపుతున్నారని చెప్పారు. అదనపు కట్నం, గొంతెమ్మ కోరికలతో భార్యలను వేధింపులకు గురిచేస్తున్నారని వివరించారు.

ఎన్నారై అంటే తల్లితండ్రుల మోజు
ఎన్‌ఆర్‌ఐ సంబంధాలపై భారత తల్లితండ్రులకున్న మోజు కూడా ఈ పరిస్థితికి కారణమని మరికొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, తమ కుమార్తెలను ఎన్నారై యువకులకు ఇచ్చి వివాహం చేసే ముందు వారి కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుంటే మంచిదని చెబుతున్నారు.

బాధిత మహిళలకు నిపుణుల కీలక సూచనలు
బాధిత మహిళలకు నిపుణులు పలు కీలక సూచనలను అందించారు. అవి.. విదేశాలకు తీసుకెళ్లిన భర్త, అత్తమామలు హింసిస్తే సహాయం కోసం అక్కడున్న భారత రాయబార కార్యాలయాలను సంప్రదించండి. పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలో సమీపంలోని స్టేషన్ పోలీస్ అధికారులను సలహా అడగండి. అత్తమామలు, భర్త పెడుతున్న చిత్రహింసలను వివరంగా ఫిర్యాదులో పొందుపరచండి. ప్రవాసుల ఇబ్బందులను పరిష్కరించే స్థానిక స్వచ్ఛందసేవా సంస్థల వివరాలను రాయబార కార్యాలయాలు ఇస్తాయి. ఆయా సంస్థల ప్రతినిధులను సంప్రదించండి. భారత రాయబార కార్యాలయం నుంచి బాధితులు ఎక్కడున్నా సాయం అందుతుంది. ఫిర్యాదు చేసేందుకు, కేసుల నమోదుకు అవసరమైన న్యాయ, ఆర్థిక సహాయాన్ని కార్యాలయం సమకూరుస్తుంది.












Click it and Unblock the Notifications