అమెరికా గడ్డపై దిగ్గజాలతో సాహితీ ఉత్సవం (ఫొటోలు)
డాల్లస్/ఫోర్టువర్త్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య వేదిక 7వ వార్షికోత్సవం గత శనివారం స్థానిక ఫార్మర్స్ బ్రాంచ్ లోని సెయింట్ మేరీస్ చర్చిలో వైభవంగా, కన్నుల పండువగా, వీనుల విందుగా, తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య ఆధ్వర్యంలో జరిగింది.
ప్రఖ్యాత సంగీతావధాని డా.మీగడ రామలింగస్వామి తమ సంగీత నవావధానంతో రెండు గంటల పాటు వీక్షకులను రంజింపచేసారు. నవావధానంలో సంధాతగా ఆచార్య పూదూర్ జగదీశ్వరన్, పృచ్ఛకులుగా చిరంజీవి కస్తూరి ప్రణవ్, శ్రీమతి సిద్దార్థ కల్యాణి, డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, శ్రీ కాజ సురేష్, శ్రీ సింహాచల శాస్త్రి , శ్రీ వెన్నెలకంటి, శ్రీ రసరాజు, వ్యవహరించారు. వారు వివిధ ప్రశ్నలు సంధించి వాటిని తమకు నచ్చిన రాగంలో ఆలపించమని కోరగా, అవధాని ఎంతో సునాయాసంగా రాగయుక్తంగా పద్యధారణ చేసారు. ఇందులో చెప్పుకోదగ్గది తెనాలి రామలింగని "కుంజర యోధము దోమ కుత్తుక జచ్చెన్" అనే పద్యాన్ని, రెండు విధాలుగా మధ్యమావతి లో,బిళహరి రాగంలొ ఎంతో హృద్యంగా ఆలపించారు.
టాంటెక్స్ అధ్యక్షుడు కాకర్ల విజయ్ మోహన్ ప్రసంగిస్తూ 84వ సదస్సు భారత దేశం నుంచి విచ్చేసిన సాహితీ దిగ్గజాల మధ్య అత్యంత ఆసక్తికరంగా జరగడం, ఇంత మంది సాహితీ ప్రియులు హాజరు కావటం తమకు ఆనందంగా ఉందన్నారు. టాంటెక్స్ కార్య నిర్వహక బృంద సభ్యులు, తెలుగు సాహిత్య వేదిక సభ్యులు అతిధులను పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువ లతో సన్మానించి, జ్ఞాపికలను అందచేసారు.
సభను ముగించే ముందు తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త వందన సమర్పణ చేస్తూ సప్తమ వార్షికోత్సవానికి విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు కృతఙ్ఞతాపూర్వక అభివందనలు తెలియజేసారు.

సాహితీ ఉత్సవం
సాహిత్యవేదిక సభ్యులు బసాబత్తిన శ్రీనివాసులు, నిమ్మగడ్డ రామకృష్ణ, పున్నం సతీష్, కొత్తమాసు సుధాకర్ ముఖ్య అతిథులను సభకు పరిచయం చేస్తూ వేదికపైకి ఆహ్వానించారు.

సాహితీ ఉత్సవం
జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమం మొదలై, టాంటెక్స్ నిర్వహించిన డా. శోబా రాజు 'వేసవి వెన్నెల ' అన్నమాచార్య శిక్షణా శిబిరంలొ పాల్గొన్న 30 మంది చిన్నారుల అన్నమాచర్య కీర్తన, ప్రార్థనా గీతాలాపనతో ముందుకు సాగింది.

సాహితీ ఉత్సవం
సమన్వయకర్త పారంభోపన్యాసం గావిస్తూ గత 84 నెలలుగాగా క్రమం తప్పకుండా జరుగుతున్న నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమ పుట్టుకను, ప్రాశస్త్యాన్ని తెలియచేశారు.

సాహితీ ఉత్సవం
ప్రఖ్యాత హరికథ కళాకారులు సింహాచల శాస్త్రి 'రామాయణం-ధర్మాచరణం', మధురకవి రసరాజు 'ఊహల పల్లకిలో ఊరేగిన ఆధునిక కవులు' , ప్రఖ్యాత రచయిత వెన్నెలకంటి 'నేటి సినిమా పోకడలు ', ఫ్రఖ్యాత నవల, టివి ధారావాహికల రచయిత్రి బలభద్రపాత్రుని రమణి 'ధారావాహికలలో స్త్రీ ప్రతినాయిక పాత్ర', ప్రఖ్యాత కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 'డాక్టర్ ఉండేల మాలకొండా రెడ్డి రచన "మానవగీత" అంశాలపై ప్రసంగించారు.

సాహితీ ఉత్సవం
శాంతి నూతి , శ్రీమతి రూప బండ రూపొందించిన జానపద నృత్యం, శ్రీమతి చావలి హేమ శిష్యులు శ్రీ జొన్నవిత్తుల రచించిన 'దశావతారం' కూచిపూడి నృత్యం స్థానిక చిన్నారులు కడు రమణీయంగా ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసారు.

సాహితీ ఉత్సవం
ప్రత్యేక ఆహ్వానితులు తిరుమల తిరుపతి దేవస్తానం చైర్మన్ శ్రీ కనుమూరి బాపిరాజు గారు ప్రవాసాంధ్రులకు తెలుగు పై గల మక్కువను కొనియాడుతూ, ఎస్.వీ భక్తి ఛానెల్ లో తెలుగు సంస్కృతి, సాహిత్యాన్ని పరిరక్షించే దిశగా మంచి సాహితీ కార్యక్రమాలకు చోటు కల్పిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications