NRI News: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి..
అమెరికాలో కత్తిపోట్లకు గురై చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి మరణించాడు. ఈ మేరకు అమెరికా అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్ రాజ్ పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తున్నారు. వరుణ్ ఎంఎస్ చేస్తూనే పార్ట్‌టైం జాబ్ కూడా చేసుకుంటున్నారు. అక్టోబర్ 31 మంగళవారం వరుణ్ జిమ్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు.
ఒక్కసారి ఓ దుండగుడు కత్తితో అతడిపై దాడికి దిగాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వరుణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వరుణ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి వరుణ్ రాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. వరుణ్ రాజ్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు ఇప్పిటికే అదుపులోకి తీసుకుని విచారించారు.

వరుణ్ పై దాడి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. బాధితులకు కావాల్సిన సహాయసహకారాలను అందిస్తామని కేటీఆర్ ఎక్స్ ద్వారా తెలిపారు. అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్‌కు కావాల్సిన సహకారాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. వరుణ్ కుటుంబసభ్యులతో తన టీం మాట్లాడుతుందని వివరించారు. దురదృష్టవశాత్తు వరుణ్ రాజ్ మరణించాడు.
వరుణ్ రాజ్ తండ్రి మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చేస్తున్నారు. వరుణ్ రాజ్ మృతితో మామిళ్లగూడెంలో విషాదం నెలకొంది. వరుణ్ రాజ్ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు వచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా గత ఫిబ్రవరిలో ఓ ఖమ్మం విద్యార్థి చనిపోయాడు.












Click it and Unblock the Notifications