పార్ట్-8
ఆ తర్వాత సాయంత్రానికి శ్రీధర్ రాంరెడ్డిని యూనిర్శిటీ దాటించి ఇంటికి బస్సెక్కించాడు. ఆ తర్వాత హాస్టళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులు కూడా విప్లవ, వామపక్ష విద్యార్థి సంఘాల విద్యార్థుల గదులపైనే జరిగాయి. కొంత మంది మీద కేసులు పెట్టారు.
యూనివర్శిటీ కాలేజీలకు వైస్ చాన్సలర్ సెలవులు ప్రకటించారు. తిరిగి ఒపెన్ చేసేది ఎప్పుడనేది ఆయన ప్రకటించలేదు. హాస్టల్ మెస్‌లను బంద్ చేసి హాస్టళ్లను ఖాళీ చేయించారు. యూనివర్శిటీ అంతా స్మశాన నిశబ్దం అలుముకుంది.
ఆ తర్వాత నెల రోజులకు యూనివర్శిటీ రీఓపెన్ అయింది. రాంరెడ్డి శ్రీధర్ సలహా మేరకు యూనివర్శిటీలో అడుగు పెట్టాడు. వామపక్ష, విప్లవ విద్యార్థి సంఘాల్లో యాక్టివ్‌గా పనిచేసేవారు కూడా పరీక్షల నాటికి ఒక్కరొక్కరే రావడం ప్రారంభించారు. రవికాంత్ జాడ మాత్రం కనిపించలేదు. విప్లవ, వామపక్ష విద్యార్థుల కార్యక్రమాలన్నీ మూతపడ్డాయి. ఎవరూ మాట మాట్లాడడం లేదు.
................. ...................... .............................
''ఏమంటావు?'' అని అడిగాడు రంగనాథం. ''నేను అనేది ఏముంది? తెలియడం లేదా? రవికాంత్ పని ఉద్యమానికి నష్టం చేసిందో, మేలు చేసిందో అర్థం కావడం లేదా?'' అన్నాడు రాంరెడ్డి.
లేచి బయటకు నడిచాడు. తన ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టంగానే ఉంది. అయితే తానే నెగిటివ్ ఆలోచిస్తున్నాడా? ఆ నెగిటివ్ ధోరణే తన చేత ఆ వార్త రాయించిందా అనే సందేహం మొదలైంది.
వీరులు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసే వీరులు మరణిస్తారు. యుద్ధ వీరులు చేసే ఈ త్యాగం అందరికీ ఆరాధనీయం. ఈ ఆరాధన అనేది తన వంటివారిని న్యూనతకు గురి చేయడం లేదా? ఈ న్యూనత వల్లనే ప్రశ్నలేయడం మానేయాలా? త్యాగం చేయలేనివాడు ప్రశ్నించకూడదా? విప్లవ వీరుల ప్రాణత్యాగం మాత్రమే త్యాగమా? ప్రజలు త్యాగాలు చేయరా? ఎవరి స్థాయిలో వారు త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఈ త్యాగాలు గుర్తింపు కోసం చేస్తుంటారు. ఈ గుర్తింపు కూడా ఎవరి స్థాయిలో వారికి లభిస్తూనే ఉంటుంది. విప్లవోద్యమ గుర్తింపు కోసం వీరులు త్యాగాలు చేస్తున్నారు. ఇదేమిటి తన ఆలోచనలు తలాతోకా లేకుండా ఉన్నాయని అనుకున్నాడు. తాను ఆలోచించడం మానేయాలి. ఆలోచించిన కొద్దీ పిచ్చి ముదురుతున్నట్లుంది.
ఎంత అదుపు చేద్దామన్నా ఆలోచనల గొలుసు తెగడం లేదు. అలా సాగిపోతూనే ఉంది. ఆ ఆలోచనలు కూడా ఉద్యమం చుట్టూ, యూనివర్శిటీ చుట్టూనూ.... యూనివర్శిటీ జ్ఞాపకమొస్తే చాలు, హృదయం ఉప్పొంగిపోతుంది. ఉల్లాసం ఉరకలు వేస్తుంది. సందేహాలు, ప్రశ్నలు లేని కాలమది. విశ్వాసం దృఢంగా వున్న యవ్వనమది. రక్తం ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లుగా ఉండేది. తాను రైటర్స్ సర్కిల్‌ను ఆర్గనైజ్ చేసిన రోజులు గుర్తొచ్చాయి. ఆర్ట్స్ కాలేజీ ముందు వారానికో పోస్టర్ కవిత రాసి పెట్టేవారు. ఆ కవితలోని ప్రతి అక్షరం ఎర్రెర్రని సూర్యుళ్లు నిప్పులు చెరుగుతూ వుండేది.
ఆ ఉప్పొంగిన ప్రవాహాలు ఇప్పుడేవి? అంతా చప్పున చల్లారిపోయాయి. అంతా నిస్తబ్దత. యూనివర్శిటీలోకి అడుగుపెడ్తే గడ్డకట్టుకుపోయిన శవాలు కదులుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలా యూనివర్శిటీ నిస్తేజం కావడానికి ఆ సంఘటన బాధ్యత ఎంత అని ప్రశ్నించుకున్నాడు. ప్రశ్న వేసుకోకూడదని, దీనికి జవాబు వెతకకూడదని అనుకున్నాడు. కానీ అది అతని వల్ల కావడం లేదు. తాను ఎం.ఎ. పూర్తి చేసి ఓ తెలుగు పత్రికలో జర్నలిస్టుగా చేరాడు. అలా చేరిన కొత్తలోనే............
మరో సంఘటన యూనివర్శిటీ ప్రాంగణంలోని హోటల్‌లో టేబుళ్ల చుట్టూ కూర్చుని ఉన్న విద్యార్థులు, ఇతరులు. అకస్మాత్తుగా పిస్టల్ పేలిన శబ్దం..........












Click it and Unblock the Notifications
