కవిస్వరం: తిలక్ తడి అద్దం
చాలా చిక్కనైన కవిత్వం రాస్తున్న కవిసంగమం కవి తిలక్ బొమ్మరాజు. ప్రకృతిని అందమైన ప్రతీకల ద్వారా అలంకరించిన కవిత తడి అద్దం. వానలో దశ్యాలు అద్దంలో లాగా ప్రతిబింబిస్తాయనేది కవి అర్థం కావచ్చు. వాన పడడానికి, వానపడిన తర్వత దృశ్యాలు ఎలా ప్రతిఫలిస్తాయో అందమైన ప్రతీకల ద్వారా తిలక్ చెప్పాడు.
నింగి చప్పుళ్లను వింటూ మట్టి వాసన గొడుతున్న ఓ పదార్థం భూమిగా మారి నవ్వుతుందని అనడంలో కవి ప్రతిభ ఉంది. ఉనికిలో ఉన్న భూమిని అభావం చేస్తూ మట్టిని ఉనికిగా మార్చి అందమైన వాక్యాన్ని తిలక్ అల్లాడు. ఇలా ప్రతి వాక్యాన్ని ఈ కవితలో కవి అద్దంగా అల్లి అద్దంలో చూపించడం మనకు కనిపిస్తుంది. చిరుజల్లులో మన ఒళ్లు తడిసి పులకరిస్తున్న భ్రాంతి కలుగుతుంది.
సముద్రాన్ని బొక్కెనగా అభివర్ణిస్తాడు ఈ కవి. అనంత విశ్వంలో సముద్రం బొక్కెన మాత్రమే కావచ్చు. సముద్రం బొక్కెనలోని నత్తగుల్లలు కేరింతలు కొడుతూ కెరటాలు జీవితాన్ని క్షణభంగురం చేసుకున్న వైనాన్ని అత్యంత ప్రతిభావంతంగా కవి చెప్పాడు. ఈ కవితలో అద్భుతమైన ప్రతీకలు మనసు తాకి అబ్బురపరుస్తాయి. అయితే, ఈ తాత్వికత అలౌకికమా, లౌకిమమా తేలాలి. కొంచెం మనసు పెట్టి చదివితే లౌకిక, అలౌకికాలకు మధ్య సరిహద్దును చెరిపేసే కవితగా కూడా చివరి నాలుగు వాక్యాల ద్వారా అర్థమవుతుంది.
- కాసుల ప్రతాపరెడ్డి

కవిస్వరం: తడి అద్దం
అగ్గిపెట్టెలో కళ్ళు మెరుస్తున్న వాన చినుకులు
మట్టి వాసనగొడుతున్న ఓ పదార్థం భూమిగా మారి నవ్వుకుంటోంది నింగి చప్పుళ్ళను వింటూ
రాత్రి చొక్కా విడిచిన ఆకాశమొకటి నగ్నమవుతోంది
వెలుగుతున్న తనువును ఊరంతా చూపిస్తూ
అమాంతం పడిపోవడానికి సిద్దంగా ఉన్న నీలపు బస్తా నింగినంటుక్కూర్చుంది
పచ్చగా మెరుస్తున్న శరీరం అడవి కంబళిని కప్పుకుంటూ
మురిసిపోతూ తేనె పండవుతోంది
చెట్లను ఒంటి మీద అలంకరించుకున్న కుక్కపిల్ల
అక్కడక్కడా ఆకులను పూలను అతికించుకుని ప్రతిరోజూ తలస్నానం చేయాల్సిందే
నత్తపిల్లలు నీళ్ళలో ఆడుకుంటూ సముద్రపు బొక్కెనలో
కేరింతలు కొడుతూ వచ్చేపోయే కెరటాలను తోసేస్తూ
అలసి కూర్చున్నాయి ఇసుకలో తనువు విదిలిస్తూ
చేతులుపుతూ పలుకరించే కొత్త గడ్డిపూలు
పళ్ళెంలో మెరిసే అమ్మ ముఖం
వాగులో కొన్ని ప్రాణాలు అటూ ఇటూ దూకుతూ
వలల్లో నిర్జీవమవుతుంటాయి
ఇంకొన్ని క్షణాలు ఇప్పుడిక్కడ జన్మిస్తాయి ఆనందాలను దుఃఖాలను మిళితం చేస్తూ
తిలక్ బొమ్మరాజు
14/09/14












Click it and Unblock the Notifications