Elon Musk: భారత ప్రభుత్వానికి మస్క్ మామ రిక్వెస్ట్.. కుబేరుల కొట్లాటకు కౌంట్‌డౌన్ స్టార్ట్
Starlink: అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఎప్పటినుంచో ఆతృతగా ఎదురుచూస్తోంది. మోదీ సర్కారుతో సయోధ్య కుదుర్చుకుని దీనికి ముహుర్తం పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంగి. ఈ మేరకు తాజాగా భారత ప్రభుత్వం ముందు కీలక అభ్యర్థన ఉంచింది. సదరు ప్రాజెక్ట్ పట్టాలెక్కితే మార్కెట్‌లోని కీలక ప్లేయర్స్ జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి షాక్ తగలడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇండియాలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్‌లింక్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అవసరమైన భద్రతా అనుమతులు పొందడం కోసం భారత ప్రభుత్వానికి అభ్యర్థన పంపింది. టెలికాం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. స్టార్ లింక్ రిక్వెస్ట్‌ని పరిశీలిస్తున్నామని, అవసరమైన అన్ని నియమాలను పాటిస్తున్నట్లయితే నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని వెల్లడించింది.

ఇది స్టార్‌లింక్ ప్లాన్‌లో ఓ ముఖ్యమైన ముందడుగుగా చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ ఇటీవల ప్రత్యక్ష వేలం ప్రక్రియ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ విధానంలో స్పెక్ట్రమ్ కేటాయించాలనే నిర్ణయం తీసుకుంది. ఇదికాస్త మస్క్ వ్యూహానికి అనుకూలంగా మారింది. తద్వారా ఇండియా మార్కెట్లోకి స్టార్ లింక్ అడుగు పెట్టడం మరింత సులభతరం అయింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ టెలికాం మంత్రి జ్యోతిరాధిత్య సింధియా కూడా కొత్త ప్లేయర్ ఎంట్రీతో పోటీతత్వం పెరిగి, తక్కవ ధరకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం రిలయన్స్ జియో భారత బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో 1.4 కోట్ల వైర్డ్ కనెక్షన్లతో ఆధిపత్యం చెలాయిస్తుంది. 479 మిలియన్ల కంటే ఎక్కువ టెలికాం వినియోగదారులకు సేవలు అందిస్తోంది. అంబానీ కంపెనీ ఇప్పటికే ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించడానికి భద్రతా అనుమతులు పొందినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇక స్టార్ లింక్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ లభిస్తే మార్కెట్లో జియోకి గట్టి పోటీగా ఎదుగుతుందని భావిస్తున్నారు. గ్రామీణ మరియు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications