భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. ఎప్పటి నుంచో తెలుసా..?
దేశంలోని దిగ్గజ టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్ ల ధరలను మరోసారి పెంచనున్నట్లు సమాచారం. టారిఫ్ ధరలను పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మొబైల్ యూజర్లు షాక్ కు గురవుతున్నారు. ఈ ఏడాది చివర్లో 10 నుంచి 20 శాతం పెంపు ఉండబోతున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ మనీ కంట్రోల్ అంచనా వేసింది.
టారిఫ్ ల పెంపు విషయంలో టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. వొడాఫోన్ ఐడియా 4జీ నుంచి 5జీకు మారే క్రమంలో అధికంగా పెట్టుబడులు పెట్టాల్సి రావడం వల్ల టారిఫ్ లను పెంచనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జియో, ఎయిర్ టెల్ సైతం రీఛార్జ్ ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉందని మనీ కంట్రోల్ సంస్థ వెల్లడించింది.
APRU వృద్ధి, మూలధనంపై మెరుగైన రాబడి కోసం టెలికాం సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే గత జులైలోనే టెలికాం సంస్థలు టారిఫ్ లను పెంచాయి. అయితే ఈ సారి భారీగానే రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయట. అదేగాని జరిగితే గత ఆరేళ్లలో అత్యధికంగా టారిఫ్ లు పెంచడం ఇది నాలుగోసారి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

గతేడాది జులైలో 25శాతం రీఛార్జ్ ధరలను టెలికాం సంస్థలు పెంచాయి. అంతకుముందు రెండేళ్లపాటు టారిఫ్ ధరలు ఒకేలా ఉండగా.. జులై 2024లో 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అలా 2021, అంతకుముందు 2019లోనూ రీఛార్జ్ ధరలు పెరిగాయి. ఇక ఈ ఏడాది డిసెంబర్ నాటికి 15శాతం మేర రీఛార్జ్ ధరలు పెరగొచ్చని మనీ కంట్రోల్ అంచనా వేసింది.
ఇప్పటికే వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ పై రూ. 50 చొప్పున పెంచింది. అటు పెట్రోల్, డీజిల్ పై రూ. 2 చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచింది. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు మొబైల్ రీఛార్జ్ ధరలు కూడా పెరిగితే పరిస్థితి ఏంటోనని సామాన్యులు ఆవేదనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications