సముద్రాన్ని ముంచెత్తుతున్న ‘నైట్రోజన్’ విషవలయం..
కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా, ఉపాధికి మార్గంగా ఉన్న సముద్ర తీర ప్రాంతాలు ఇప్పుడు ఊపిరాడక అల్లాడిపోతున్నాయి. మానవుడు తన స్వార్థం కోసం చేస్తున్న మితిమీరిన కార్యకలాపాల వల్ల సముద్ర జలాల్లో 'నైట్రోజన్' వ్యర్థాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీరప్రాంత జలమార్గాల్లో నాలుగో వంతు (25 శాతం) కంటే ఎక్కువ ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధంగా వచ్చే వ్యర్థాల కంటే, మనుషులు చెత్త రూపంలో పారబోస్తున్న నైట్రోజన్ ప్రమాణాలే అత్యధికంగా ఉన్నాయని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు బాంబు పేల్చారు. గ్లోబల్ బయోజియోకెమికల్ సైకిల్స్ పత్రికలో ప్రచురితమైన ఈ తాజా నివేదిక ప్రపంచ పర్యావరణవేత్తలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
సముద్రాల్లో నైట్రోజన్ ఎందుకు ప్రమాదకరం?
సాధారణంగా సముద్రంలోని జీవజాలం, ప్లాంక్టన్ పెరగడానికి నైట్రోజన్, భాస్వరం, సిలికాన్ వంటి పోషకాలు అవసరమే. కానీ, పరిమితికి మించి నైట్రోజన్ సముద్రంలోకి చేరినప్పుడు అది విషంగా మారుతుంది. ఇది విపరీతంగా నాచు రూపాంతరం చెందడానికి (ఆల్గల్ బ్లూమ్స్) దారితీస్తుంది. ఈ నాచు సముద్రంలో ఉండే ఆక్సిజన్‌ను మొత్తం పీల్చేయడం వల్ల నీటిలో ఆక్సిజన్ కొరత ఏర్పడి, చేపలు , ఇతర జలచరాలు శ్వాస తీసుకోలేక చనిపోతాయి. దీనివల్ల సముద్రాల్లో జీవం ఉండని 'డెడ్ జోన్లు' ఏర్పడటమే కాకుండా, చేపల వేటపై ఆధారపడిన మత్స్యకారుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తోంది.

పొలాలు, ఫ్యాక్టరీల వ్యర్థాలే అసలు విలన్లు!
సముద్రం ఈ స్థాయిలో కలుషితం కావడానికి ప్రధానంగా వ్యవసాయంలో వాడుతున్న రసాయన ఎరువులు, పురుగుమందుల వ్యర్థాలేనని సైంటిస్టులు గుర్తించారు. వీటితో పాటు నగరాల నుంచి మురుగునీరు సముద్రాల్లోకి కలవడం, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, రవాణా వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు నైట్రోజన్ శాతాన్ని పెంచేస్తున్నాయి. మెక్సికో గల్ఫ్ ప్రాంతంలో మిసిసిపీ నది ద్వారా ఏటా వేలాది టన్నుల వ్యవసాయ వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద 'డెడ్ జోన్' ఏర్పడింది. ఐరోపా, ఆసియా, ముఖ్యంగా భారతదేశం, చైనా తీరప్రాంతాల్లో కూడా ఇదే తరహా ప్రమాదకర వాతావరణం నెలకొందని రీసెర్చ్ స్పష్టం చేసింది.
సిలికాన్ తగ్గిపోవడంతో దెబ్బతింటున్న జీవావరణం
నైట్రోజన్ పెరిగిపోవడమే కాకుండా, సముద్రాలకు ఎంతో మేలు చేసే సిలికాన్ శాతం తగ్గిపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. నదులపై విపరీతంగా డ్యామ్‌లు కట్టడం వల్ల సిలికాన్‌ను మోసుకొచ్చే మేటలు సముద్రాలకు చేరకుండా ఆగిపోతున్నాయి. దీనివల్ల ఉపయోగకరమైన ప్లాంక్టన్ నశించిపోయి, విషపూరితమైన నాచు పెరిగిపోతోంది. ఈ విషపు నాచు తిన్న చేపలను మనుషులు ఆహారంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు!
ఈ ముప్పు నుంచి సముద్ర తీరాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం, పర్యావరణ సంస్థలు తక్షణమే చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. డ్రైనేజీ నీటిని సముద్రంలోకి వదిలే ముందు శుద్ధి చేసే మోడర్న్ ప్లాంట్లను అందుబాటులోకి తేవాలి. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి సిద్ధమైన పద్ధతులను ప్రోత్సహించాలి. నదుల పక్కన, తీరప్రాంతాల్లో చిత్తడి నేలలు (వెట్‌ల్యాండ్స్) దెబ్బతినకుండా చూసుకుంటే, అవి సహజ సిద్ధమైన ఫిల్టర్లుగా పనిచేసి నైట్రోజన్ వ్యర్థాలను సముద్రంలో కలవకుండా అడ్డుకుంటాయి. కాలం మించిపోకముందే ఈ నైట్రోజన్ ముప్పుకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో సముద్ర ఆహార వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
