రెడ్లలో చీలిక- బీజేపీ దోస్తీ-ఫైనల్ గా వైసీపీకి షాక్..! సాయిరెడ్డి కొత్త పార్టీ అజెండా ఇదేనా?

ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యాపారాలకు ఆడిటర్ గా, తర్వాత వైఎస్సార్సీపీలో పార్లమెంటరీ పార్టీ నేతగా, ప్రాంతీయ సమన్వయకర్తగా ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. ఆ తర్వాత హఠాత్తుగా ఎంపీ పదవికి, సొంత పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఆ తర్వాత తూచ్.. రాజకీయాల్లోనే ఉన్నానంటూ, కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇంతకీ సాయిరెడ్డి పార్టీ ఏర్పాటు వెనుక అజెండా ఏంటి ?, టార్గెట్ ఏంటి? ఏపీ రాజకీయాల్లో ఇది ఎవరికి నష్టం చేయబోతోందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ప్లాన్ పై వన్ ఇండియా ఎక్స్ క్లూజివ్ కథనం..

సన్నిహితుడ్ని అడ్డుపెట్టి జగన్ టార్గెట్ ..! కూటమినీ లాగి-సాయిరెడ్డి బిగ్ ప్లాన్.!
సన్నిహితుడ్ని అడ్డుపెట్టి జగన్ టార్గెట్ ..! కూటమినీ లాగి-సాయిరెడ్డి బిగ్ ప్లాన్.!

విజయ సాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ

దసరాకు కొత్త రాజకీయ పార్టీ స్థాపించేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు విజయవాడ, అనంతపురంలో రెండు ప్రెస్ మీట్లు పెట్టి తన అజెండాను క్రమంగా బయటపెడుతున్నారు. విజయవాడలో తన పార్టీ ఐదు అంశాల అజెండాను ప్రకటించారు. ఇందులో నిత్యావసర ధరలు తగ్గించడం - ప్రజల ఆదాయం పెంచడం, ఇళ్లకు, రైతులకు ఉచిత విద్యుత్ అందించడం, పెట్రోల్, డీజిల్‌పై పన్నుల తగ్గింపు, నీటి నిల్వ సామర్థ్యాన్ని 3 వేల టీఎంసీలకు పెంపు, విద్య, ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి ఉన్నాయి. విజయవాడ ప్రెస్ మీట్లో రెడ్లు, కమ్మ వారు మాత్రమే అధికారం అనుభవించాలా అంటూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సాయిరెడ్డి వేసిన ప్రశ్నపై వచ్చిన విమర్శలతో అనంతపురంలో అసలైన రెడ్ల కోసమే పనిచేస్తామంటూ మాట మార్చేశారు. అలాగే సీఎంగా తాను ఉండనంటూ ప్రాంతీయ పార్టీల్లో కనిపించని మరో విచిత్ర వాదన తెరపైకి తెస్తున్నారు.

కూటమి ప్రభుత్వానికి సాయిరెడ్డి కీలక డిమాండ్, రెడ్ల పౌరుషాన్ని కాపాడేందుకే..!!
కూటమి ప్రభుత్వానికి సాయిరెడ్డి కీలక డిమాండ్, రెడ్ల పౌరుషాన్ని కాపాడేందుకే..!!
Vijayasai Reddy New Political Party Targeting Reddy Votes Courting BJP Challenging YSRCP

టార్గెట్ రెడ్లు, వైసీపీకి దూరం చేసే యత్నం

ఏపీలో రెడ్డి సామాజిక వర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైఎస్సార్సీపీకి దగ్గరగా ఉంది. టీడీపీలోనూ పేరుకు ఒకరిద్దరు రెడ్లు కనిపిస్తున్నా.. అంతిమంగా రెడ్లు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారు. ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని వైఎస్సార్సీపీకి దూరం చేసేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్దమవుతోంది. అందులో భాగంగానే కమ్మ, రెడ్లకే అధికారం ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు. విమర్శలు వచ్చే సరికి రూటు మార్చి అనంతపురంలో కుల దోపిడీ పార్టీ, మత పిచ్చి పార్టీ అంటూ కొత్త స్వరం అందుకున్నారు. ఇప్పటికే వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలతో టచ్ లోకి వెళ్తున్న సాయిరెడ్డి.. వారిని తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ లలోని రెడ్లను కూడా లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా వైసీపీకి రెడ్లను సాధ్యమైనంతగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మత అజెండాతో బీజేపీకి దగ్గరయ్యే యత్నం

విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పెట్టకముందే లవ్ జిహాద్ వంటి ఉత్తరాదిలో బీజేపీ వాడుతున్న పదాన్ని తీసుకొచ్చి రాజమండ్రిలో ఎస్ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య-సాదిక్ ఖాన్ ప్రమేయంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అలాగే రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఎన్నడూ లేనంతగా మత మార్పిళ్లు జరిగాయని, ఇప్పటికీ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మత మార్పిళ్లపై బీజేపీ కూడా స్పందించనంతగా సాయిరెడ్డి స్పందిస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో క్రైస్తవుల్ని ఆకట్టుకునేందుకు చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీకి ఆపాదిస్తూ, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం ఎంత మందిని మతం మార్చారో అని ప్రశ్నించారు. తద్వారా బీజేపీకి వైఎస్సార్సీపీకి ఇంకా పరోక్షంగా కొనసాగుతుందని భావిస్తున్న బంధానికి బ్రేకులు వేసేందుకు సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో చేరేందుకే వైఎస్సార్సీపీ ఇచ్చిన ఎంపీ పదవిని త్యాగం చేశారనే ఆరోపణలు ఉన్న సాయిరెడ్డి.. ఇలాగైనా కాషాయ పార్టీకి దగ్గర కావచ్చని భావిస్తున్నారు.

Vijayasai Reddy New Political Party Targeting Reddy Votes Courting BJP Challenging YSRCP

వైఎస్సార్సీపీని దెబ్బతీసే ప్రయత్నాలు

పైకి కూటమికీ, వైఎస్సార్సీపీకీ పెద్ద తేడా లేదని, ఇద్దరూ ఒకటేనంటూ, ఇద్దరికీ వ్యతిరేకంగా తాను కొత్త పార్టీ పెడుతున్నానంటూ చెప్పుకుంటున్న సాయిరెడ్డి.. లోపల మాత్రం వైఎస్సార్సీపీ టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఓవైపు క్రైస్తవం పేరుతో టార్గెట్ చేస్తూ, మరోవైపు రెడ్లను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా టీడీపీ నడుపుతున్న ఎన్డీయే కూటమికి పరోక్షంగా లాభం చేకూర్చేందుకు సాయిరెడ్డి సిద్దమవుతున్నారు. ఈ ప్రయత్నంలో కేంద్రం, బీజేపీ మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. రాజకీయ అంశాలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించాల్సిన తరుణంలో వైఎస్సార్సీపీని మతం పేరుతో టార్గెట్ చేయడం, రెడ్లకే అధికారం కావాలా అని ఓసారి ప్రశ్నించడం, రెడ్ల ఆగ్రహంతో అసలైన రెడ్లకు అండగా నిలుస్తామని ప్రకటించడం సాయిరెడ్డి చపల చిత్తానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ముందు వైఎస్సార్సీపీలో కోటరీని మాత్రమే టార్గెట్ చేసిన సాయిరెడ్డి.. ఇప్పుడు మత పిచ్చి పార్టీ అంటూ ఏకంగా జగన్ పైనే బాణం ఎక్కుపెడుతున్నారు. దీనిపై వైసీపీ స్పందిస్తే, మరిన్ని విషయాలు బయటపెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

సాయిరెడ్డి రాజకీయం ఫలించేనా ?

అసలు, నకిలీ పేరుతో రెడ్లలో చీలిక , మతం పేరుతో బీజేపీకి దగ్గరయ్యే యత్నాలు, అంతిమంగా వైసీపీకి రాజకీయంగా నష్టం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్న సాయిరెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా అంటే కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే కాంగ్రెస్ తర్వాత వైఎస్సార్సీపీకి బాగా దగ్గరైపోయిన రెడ్లను, ఆ పార్టీకి దూరం చేయడం అంత సులువు కాదు. దీనికి కావాల్సింది రెడ్డి నాయకత్వమే. స్వయంగా సాయిరెడ్డి నాయకత్వం వహించి, భవిష్యత్తులో సీఎం అవుతానని ప్రకటించినా రెడ్లలో చీలిక కష్టమే. అలాగే మతం పేరుతో బీజేపీకి దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలూ ఫలిస్తాయని చెప్పలేం. ఎందుకంటే కులాల రాజకీయాలు ఎక్కువగా ఉండే ఏపీలో మతం పేరుతో ప్రజల్ని విడదీయడం అంత సులువు కాదని బీజేపీకీ తెలుసు. ఆ ప్రయత్నంలో సాయిరెడ్డి సక్సెస్ అవుతారనే నమ్మకం ఉంటేనే బీజేపీ సహకరిస్తుంది. లేకపోతే కూటమి రాజకీయాలతోనే సర్దుకుపోతుంది. అలాగే వైఎస్సార్సీపీని కేవలం రెడ్లు, మతం కోణంలోనే దెబ్బతీయాలనే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. సో ఎలా చూసినా సాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ.. జనం ఏపీలో ఏం కోరుకుంటున్నారనే వాస్తవ అంశాలపై ఆధారపడితే సక్సెస్ అయ్యే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+