పసిడి పుట్టుక ఎలాగో తెలుసా? సైంటిస్టులు కనిపెట్టిన రహస్య "గోల్డ్ కిచెన్"!
ప్రకృతి ఒడి.. అద్భుతాల గని. పుడిమిలో దాగి ఉన్న రహస్యాలు మానవ మేధస్సుకు ఎప్పటికప్పుడు సవాలు విసురుతూనే ఉన్నాయి. మానవాళి అత్యంత విలువైనదిగా భావించే 'పసిడి' అసలు ఎక్కడ, ఎలా తయారవుతుందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఒక వినూత్న సమాధానాన్ని కనుగొన్నారు. సముద్ర గర్భంలో చాలా లోతున, అగ్నిపర్వతాలు కొలువై ఉన్న ప్రాంతాల కింద ఒక భారీ "గోల్డ్ కిచెన్" నిరంతరం పనిచేస్తోందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. పసిడి కేవలం నేలపైన లేదా కొండల్లో మాత్రమే కాకుండా.. సముద్రాల అడుగున ఉన్న తీవ్రమైన ఉష్ణోగ్రతలు, రాతి పొరల రసాయనిక చర్యల వల్ల భూమి లోతుల్లో అత్యంత సమృద్ధిగా రూపుదిద్దుకుంటోందని నిపుణులు వెల్లడించారు.
జర్మనీకి చెందిన 'జియోమార్ హెల్మ్‌హోల్ట్జ్ సెంటర్ ఫర్ ఓషన్ రీసెర్చ్' నిపుణుడు డాక్టర్ క్రిస్టియన్ టిమ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. న్యూజిలాండ్ సమీపంలోని సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వత శ్రేణుల నుంచి 66 రకాల అరుదైన సాంపుల్స్‌ను వారు సేకరించారు.

నీటి అడుగున అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అత్యంత వేగంగా చల్లబడే లావా.. ప్రత్యేకమైన గాజు రూపంలోకి మారుతుంది. ఈ గాజు నమూనాలను అత్యాధునిక పరికరాలతో విశ్లేషించినప్పుడు శాస్త్రవేత్తలకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. ఈ లావా నమూనాల్లో సాధారణ సముద్ర గర్భంలో ఉండే పసిడి పరిమాణం కంటే అనేక రెట్లు ఎక్కువ స్థాయిలో బంగారం ఆనవాళ్లు లభించాయి.
ఒక్కసారి కాదు.. మళ్లీ మళ్లీ కరిగితేనే కమ్మనైన పసిడి!
భూమి లోపలి పొరల్లో బంగారం ఎలా సమృద్ధిగా చేరుతుందో వివరిస్తూ శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సముద్ర పలకలు ఒకదాని కిందకు మరొకటి నెట్టివేసే క్రమంలో తీవ్రమైన వేడి, నీటి ఉనికి వల్ల భూమి లోపలి పొరలు కరగడం ప్రారంభిస్తాయి. ఈ కరిగే ప్రక్రియ ఒకే ఒక్కసారి కాకుండా.. పదే పదే జరగడం వల్ల బంగారం శాతంలో తీవ్ర మార్పులు వస్తాయి. భూమి పొరల్లోని సల్ఫైడ్ ఖనిజాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద పూర్తిగా కరిగిపోయి, వాటిలో దాగి ఉన్న బంగారం మొత్తాన్ని క్రమంగా లావాలోకి విడుదల చేస్తాయి. ఈ బహుళ దశల కరిగే ప్రక్రియే బంగారాన్ని ఒకే చోట అత్యధికంగా సాంద్రీకరించేలా చేస్తుంది.
ఇది మొదటి అడుగే.. కానీ ఇప్పుడే తవ్వలేం!
సముద్రాల అడుగున ఉన్న వ్యవస్థలు పసిడిని సృష్టిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం కనుగొన్న నమూనాల ఆధారంగా అక్కడ వెంటనే గనుల తవ్వకాలు జరపడం సాధ్యపడదని పరిశోధకులు స్పష్టం చేశారు. వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉండాలంటే రాళ్లలో ప్రస్తుతం ఉన్నదానికంటే చాలా రెట్లు ఎక్కువ పరిమాణంలో పసిడి నిల్వలు ఉండాలి. అయితే, పసిడి ఏర్పడే భూగర్భ ప్రక్రియలో ఇది అత్యంత కీలకమైన మొదటి అడుగు అని డాక్టర్ క్రిస్టియన్ టిమ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో సముద్ర గర్భంలో తవ్వకాలు, బంగారం ఆధారిత ఖనిజ నిల్వల అన్వేషణకు ఈ పరిశోధన ఒక సరికొత్త మార్గాన్ని చూపనుంది.














Click it and Unblock the Notifications