పురుషులు కంటే ఎక్కువగా స్త్రీలు ఏడవడానికి కారణాలు ఇవే..!
“మగవారు ఏడవకూడదు, ఆడవాళ్లు చిన్న విషయాలకే కన్నీళ్లు పెట్టుకుంటారు” – సమాజంలో తరచుగా వినిపించే ఈ మాటలకు భిన్నంగా, మహిళలే పురుషుల కంటే ఎక్కువగా ఏడుస్తారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీని వెనుక శాస్త్రీయ, జీవశాస్త్ర, మానసిక కారణాలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. జర్మన్ సొసైటీ ఆఫ్ ఆప్తాల్మాలజీ అధ్యయనం ప్రకారం, ఒక మహిళ ఏడాదికి సగటున 30 నుండి 64 సార్లు ఏడుస్తుండగా, పురుషులు 6 నుండి 17 సార్లు మాత్రమే ఏడుస్తారు. కన్నీళ్ల వ్యవధిలోనూ తేడా ఉంది: మహిళల్లో సగటున 6 నిమిషాలు, పురుషులలో అవి 2-3 నిమిషాలకే పరిమితమవుతాయి.
ఈ వ్యత్యాసానికి హార్మోన్ల పాత్ర కీలకం. మహిళల్లో ప్రోలాక్టిన్ హార్మోన్ స్థాయిలు (పురుషుల కంటే 60% అధికం) కన్నీళ్లతో నేరుగా ముడిపడి ఉంటాయి. అదే పురుషులలో ఎక్కువగా ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ కన్నీళ్లను అణచివేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శారీరక నిర్మాణంలోనూ తేడా ఉంది. మహిళల్లో కన్నీటి గ్రంథులు పురుషుల కంటే చిన్నవిగా, తక్కువ లోతుగా ఉంటాయి. దీనివల్ల కన్నీళ్లు త్వరగా నిండి, సులభంగా బయటకు వస్తాయి. పురుషులలో పెద్ద గ్రంథులు ఎక్కువ కన్నీళ్లను లోపల నిలిపి ఉంచగలవు.

భావోద్వేగాలను వ్యక్తీకరించే విధానంలోనూ లింగ భేదాలున్నాయి. మహిళల మెదడులోని ఎమిగ్డలా ఇతర భాగాలు ఒత్తిడికి, బాధకు త్వరగా స్పందిస్తాయి. ఏదైనా బాధాకరమైన సంఘటనను వారు లోతుగా అనుభూతి చెందుతారు. ఏడవడం అనేది శరీరం తనను తాను శాంతపరచుకోవడానికి చేసే ఒక ప్రక్రియ. ఏడ్చినప్పుడు ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ వంటి 'ఫీల్-గుడ్' హార్మోన్లు విడుదలవుతాయి. మహిళలు ఏడవడం ద్వారా తమ ఒత్తిడిని, ఆందోళనను సులభంగా బయటకు పంపుతారు.
ఈ ధోరణికి సామాజిక పెంపకం కూడా ఒక ప్రభావం. చిన్ననాటి నుండి బాలికలు ఏడిస్తే "నువ్వు అమ్మాయివి, ఏడిస్తే పర్వాలేదు" అని ప్రోత్సహించబడుతుంది. దీనివల్ల వారు తమ బాధను కన్నీళ్ల రూపంలో దాచుకోకుండా బహిరంగంగా వ్యక్తం చేస్తారు. అదే సమయంలో, అబ్బాయిలు ఏడిస్తే "మగవాడివై ఉండి ఏడుస్తావేంటి? ఆడదానిలా ఏడవకు" అని చిన్ననాటి నుంచే నొక్కిచెబుతారు. ఇది పురుషులు తమ బాధను లోపలే అణచివేయడానికి దారితీస్తుంది. ఫలితంగా అది కన్నీళ్లుగా కాకుండా కోపంగానో, చిరాకుగానో బయటకు వస్తుంది.
మొత్తంగా, హార్మోన్లు పునాది వేయగా, సామాజిక పరిస్థితులు, భావోద్వేగాలు కన్నీళ్లను మరింత ప్రేరేపిస్తాయి. ఏడవడం బలహీనత కాదని సైన్స్ స్పష్టం చేస్తోంది; ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గించి ఆయుష్షును పెంచుతుంది. బహుశా అందుకే మహిళల సగటు జీవితకాలం ఎక్కువని కొందరు నిపుణుల అభిప్రాయం.












Click it and Unblock the Notifications