చరిత్ర సృష్టించిన భారత్.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి 'విక్రమ్-1'
భారతదేశ అంతరిక్ష యవనికపై భారత సరికొత్త ప్రైవేట్ శకం అధికారికంగా ప్రారంభమైంది. చివరి నిమిషంలో ఊపిరి బిగబట్టేలా చేసిన ఉత్కంఠకు తెరదించుతూ.. ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1' నింగి వైపు దూసుకెళ్లింది.
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు ఈ చారిత్రాత్మక రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. నిజానికి ఈ ప్రయోగం ఉదయం 11:30 గంటలకే జరగాల్సి ఉన్నప్పటికీ, కౌంట్‌డౌన్ చివరి క్షణాల్లో చిన్న సాంకేతిక లోపం తలెత్తింది. అయితే, ఇస్రో, స్కైరూట్ శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా ఆ లోపాన్ని సరిదిద్ది, కేవలం 35 నిమిషాల ఆలస్యంతో రాకెట్‌ను నింగిలోకి పంపించి శభాష్ అనిపించుకున్నారు.

తొలి ప్రయత్నంలోనే సరికొత్త రికార్డులు..
ఈ 'మిషన్ ఆగమన్' విజయం ద్వారా భారతదేశంలో ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ స్వంత రాకెట్ వాహక నౌక సాయంతో శాటిలైట్లను అంతరిక్ష కక్ష్యలోకి చేర్చిన మొదటి ప్రైవేట్ కంపెనీగా స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. గతంలో ప్రైవేట్ సంస్థలు కేవలం విడిభాగాలు సరఫరా చేయడానికే పరిమితం కాగా, ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి సరికొత్త మైలురాయిని అధిగమించాయి. ఈ రాకెట్ తయారీలో వాడిన అధునాతన 'ఆల్ కార్బన్ కంపోజిట్' నిర్మాణం ఉక్కు కంటే బలమైనది, తేలికైనది కావడం గమనార్హం.
#WATCH | Andhra Pradesh: India's first privately developed orbital-class rocket, Vikram-1, launched from the Satish Dhawan Space Centre in Sriharikota
— ANI (@ANI) July 18, 2026
Built by Hyderabad-based Skyroot Aerospace, Vikram-1 is powered by three solid-fuel stages and a liquid orbital adjustment… pic.twitter.com/QQC9CPjcxH
నింగిలోకి చేరిన త్రీడీ ఇంజిన్.. విశ్వంలోకి 'ల్యాబ్ డైమండ్'
సాంకేతిక ఆవిష్కరణల పరంగా ఈ రాకెట్‌లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. భూమి కక్ష్య దాటిన తర్వాత ఉపగ్రహాలను సరైన స్థానంలో ఉంచేందుకు వీలుగా 100 శాతం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో చేసిన లిక్విడ్ ఇంజిన్‌ను ఇందులో వాడారు. అంతరిక్షంలో పెరిగిపోతున్న చెత్తను శుభ్రం చేసే భవిష్యత్తు ప్రయోగాల కోసం 'ఎంబ్రేస్' అనే రోబోటిక్ హ్యాండ్ పరికరాన్ని కూడా ఇందులోనే అమర్చారు. వీటన్నిటితో పాటు సైన్స్, ఆర్ట్ ల కలయికగా ల్యాబ్‌లో ప్రత్యేకంగా పెంచిన 'కాస్మిక్ బ్లూమ్' అనే డైమండ్‌ను వినూత్న పేలోడ్‌గా అంతరిక్షంలోకి పంపించారు.
సైన్స్ దిగ్గజాలకు నివాళి.. ప్రధాని మోదీ సందేశం!
ఈ అద్భుత విజయంతో పాటు మన దేశ సైన్స్ రంగానికి ఊపిరిపోసిన మహనీయులకు సముచిత గౌరవం దక్కింది. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, సర్ సీవి రామన్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే. అబ్దుల్ కలాంల మైక్రో శిల్పాలు చెక్కిన 18 క్యారెట్ల చిన్న బంగారు రాకెట్‌ను ఈ ప్రయోగం ద్వారా గౌరవసూచకంగా పంపారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వహస్తాలతో "వందేమాతరం" అని రాసి, సంతకం చేసిన ప్రత్యేక పోస్ట్‌కార్డు కూడా ఈ రాకెట్ ద్వారా గగన విహారం చేసింది. చిన్న అంతరాయాన్ని సైతం సమర్థవంతంగా అధిగమించి సాధించిన ఈ విజయం, ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో భారత ప్రైవేట్ రంగానికి తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది.














Click it and Unblock the Notifications