హార్దిక్ పాండ్యాకు తిరగబెట్టిన గాయం- ఇప్పట్లో ఆడటం కష్టమే
శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడబోతోంది. మూడు మ్యాచ్ ల సిరీస్ ఆడబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ లన్నీ జరుగనున్నాయి.. ఈ సిరీస్ కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ లో భారత్ తో సిరీస్ కు ఆఫ్ఘనిస్తాన్ బోర్డు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. స్వదేశంలో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితులు లేనందున.. తన హోమ్ సిరీస్‌ను భారత్ వేదికగా జరపాలని నిర్ణయించింది.
ఈ నెల 13వ తేదీన మొదటి మ్యాచ్ ఆరంభమౌతుంది. 15, 17 తేదీల్లో మిగిలిన రెండింటినీ నిర్వహిస్తారు. ఒకే స్టేడియంలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడబోతోండటం పట్ల క్రేజ్ ఏర్పడింది. ఈ సిరీస్ కు హార్దిక్ పాండ్యా ఆడటం ఖాయమైందంటూ మొదట్లో వార్తలొచ్చాయి. గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వేల్లో జరిగిన టీ20 సిరీస్ లకు అందుబాటులో లేని ఈ ఆల్ రౌండర్ ఆఫ్ఘన్ తో మ్యాచ్ లకు రెడీ అయ్యాడు కూడా.

ప్రస్తుతం బెంగళూరులో బీసీసీఐకి చెందిన నేషనల్ క్రికెట్ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్ లో ఉంటోన్నాడు. దాదాపుగా వంద శాతం ఫిట్ నెస్ ను సాధించాడు. నెట్ ప్రాక్టీస్ లోనూ ముమ్మరంగా పాల్గొంటోన్నాడు. ఇక్కడే ఎదురుదెబ్బ తగిలింది. కుడి కాలి పిక్కల్లో గాయం తగ్గట్లేదు. నెట్స్ లో 10 ఓవర్ల పాటు నిలకడగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. బ్యాటింగ్ పైనా దృష్టి పెట్టడంలో ఇబ్బందులు పడుతున్నాడు. తనదైన శైలిలో షాట్లు ఆడలేకపోతున్నాడు.
అతని గాయం తిరగబెట్టిందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో అతని పునరాగమనానికి బ్రేక్ పడిందని పేర్కొంది. తాజా గాయం కారణంగా ఆయన ఈ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు సెలక్టర్లు ఈ వారంలోనే సమావేశం కానున్నారు. గాయం కారణంగా బెంగళూరులో రిహాబిలిటేషన్ లో ఉంటోన్న ఇతర ప్లేయర్ల ఫిట్ నెస్ ను కూడా సమీక్షించనున్నారు.
బ్యాటింగ్ సమయంలో అతని ఫుట్ వర్క్ ఫర్వాలేదనిపించినప్పటికీ.. బౌలింగ్ చేసేటప్పుడు అసౌకర్యం తలెత్తుతోంది. దీంతో కాలి నొప్పి మరింత తీవ్రతరం కాకుండా ఉండటానికి ప్రాక్టీస్ ను తాత్కాలికంగా ఆపాలని బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి సూచించింది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేనందున.. ఇప్పటికిప్పుడు ఫిట్‌నెస్ సాధించడం అసాధ్యమౌతుందని అంచనా వేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు దక్కుతుంది.













Click it and Unblock the Notifications