ఫైనల్ బెర్త్ కోసం గట్టిగా ప్లాన్ చేసిన పాక్: ఏకంగా అయిదు మార్పులతో తుదిజట్టు ప్రకటన
కొలంబో: ఆసియా కప్ 2023 టోర్నమెంట్ సూపర్ 4లో భాగంగా పాకిస్తాన్ కీలక మ్యాచ్ ఆడబోతోంది. శ్రీలంకను ఎదుర్కొనబోతోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం- దీనికి వేదిక. ఈ రెండు జట్లకూ ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్. గెలిచిన జట్టు ఫైనల్స్‌కు వెళ్లగలుగుతుంది. ఇప్పటికే ఫైనల్స్‌లో అడుగుపెట్టిన టీమిండియాతో తలపడగలుగుతుంది.
సూపర్ 4లో భారత్ 41 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఆసియా కప్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 17వ తేదీన ఫైనల్స్ ఆడనుంది. అంతకంటే ముందు 15వ తేదీన చివరి లీగ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఫైనల్స్ చేరబోయే టీమ్ ఏదనేది పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ నిర్ణయిస్తుంది. గెలిచిన జట్టు ఫైనల్స్‌కు వెళ్తుంది.

ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆసియా కప్‌పై పాకిస్తాన్‌కు పెద్దగా పట్టు లేదు. ఇప్పటివరకు 15 సార్లు ఆసియా కప్ టోర్నమెంట్ జరగ్గా.. ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా. ఆరుసార్లు శ్రీలంక ఈ టైటిల్‌ను ఎగరేసుకెళ్లింది. రెండుసార్లు మాత్రమే పాకిస్తాన్ ఆసియా కప్ విజేతగా నిలిచింది.
ఈ దఫా ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది బాబర్ ఆజమ్ టీమ్. అందుకే ఫైనల్స్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఆడబోయే జట్టులో పెను మార్పులు చేసింది. తుది జట్టులో ఏకంగా అయిదు మార్పులకు దిగింది. శ్రీలంకను ఎదుర్కొనబోయే తుదిజట్టును కొద్దిసేపటి కిందటే ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.
తుదిజట్టులో- మహ్మద్ హ్యారిస్, ఇమాముల్ హక్, బాబర్ ఆజమ్ (కేప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సవూద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదబ్ ఖాన్ (వైస్ కేప్టెన్), మహ్మద్ నవాజ్, షహీన్ షా అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, జమాన్ ఖాన్‌ను తీసుకుంది. ఇదే జట్టు శ్రీలంకను ఎదుర్కొనబోతోంది.












Click it and Unblock the Notifications