CWG 2026: నీరజ్, నదీమ్‌లకు ఊహించని షాక్.. పసిడి రేసులోకి సరికొత్త సంచలనం!
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026 పురుషుల జావెలిన్ త్రో పోరు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఇండియాకు చెందిన నీరజ్ చోప్రా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌ల మధ్య జరిగే ఉత్కంఠభరితమైన పోరాటమే. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో ఛాంపియన్లుగా నిలిచిన ఈ ఇద్దరూ దక్షిణాసియాలో ఈ క్రీడకు విశేష క్రేజ్ తీసుకొచ్చారు. అయితే స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ పోరులో వీరిద్దరి ఆధిపత్యానికి గండికొట్టేలా శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే రూపంలో మరో కొత్త స్టార్ తెరపైకి వచ్చాడు. దీంతో ఈ కామన్వెల్త్ పసిడి పతక రేసు ఇప్పుడు త్రిముఖ పోరుగా మారింది.
పూర్తి ఫిట్‌నెస్‌తో నీరజ్ చోప్రా రీఎంట్రీ
గాయం కారణంగా గత కామన్వెల్త్ క్రీడలకు దూరమైన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ తో బరిలోకి దిగుతున్నాడు. గత సీజన్లో 90.23 మీటర్ల జాతీయ రికార్డుతో 90 మీటర్ల మార్కును అధిగమించిన నీరజ్ చోప్రా.. ఈ సీజన్ ఆరంభంలో 85.69 మీటర్ల ఉత్తమ త్రో నమోదు చేశాడు. 9 నెలల విరామం తర్వాత డైమండ్ లీగ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన నీరజ్ చోప్రా తన ఫామ్ అందుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. పెద్ద వేదికలపై సంచలనాలు సృష్టించడం అతనికి అలవాటే. సమయయం వచ్చినప్పుడు తన దైన స్టైల్లో పసిడి పతకాలు సాధించడం అతనికి అలవాటే.

అర్షద్ నదీమ్.. డేంజర్ మ్యాన్
పారిస్ ఒలింపిక్స్‌లో 92.97 మీటర్ల రికార్డు త్రోతో స్వర్ణం సాధించిన అర్షద్ నదీమ్ కూడా పతకానికి అత్యంత బలమైన పోటీదారుడే. కుడి కాలి శస్త్రచికిత్స తర్వాత అర్షద్ నదీమ్ తక్కువ పోటీల్లో పాల్గొన్నప్పటికీ.. కీలక టోర్నీల్లో నేరుగా వచ్చి అద్భుతాలు చేయగల సామర్థ్యం అతనికి ఉంది. కామన్వెల్త్ క్రీడల్లో మళ్లీ అర్షద్ నదీమ్ విజృంభిస్తే ప్రత్యర్థులకు గట్టి పోటీ తప్పదు.
సంచలనంగా మారిన శ్రీలంక ప్లేయర్
ఈ ఇద్దరి అగ్రశ్రేణి అథ్లెట్ల నడుమ అనూహ్యంగా దూసుకొచ్చిన శ్రీలంక అథ్లెట్ రుమేష్ తరంగ పతిరాగే ఈ ఏడాది కామన్వెల్త్ అథ్లెట్లలోనే అత్యుత్తమంగా 92.62 మీటర్ల త్రో విసిరి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆసియా చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ త్రో కావడం గమనార్హం. అంతేకాకుండా దోహా డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాను ఓడించి తన సత్తా ఏంటో ఇప్పటికీ నిరూపించుకున్నాడు. గ్లాస్గోలో రుమేష్ తరంగ పతిరాగే కేవలం పోటీ పడేందుకు మాత్రమే కాకుండా.. స్వర్ణం గెలుచుకునే ధీమాతో బరిలోకి దిగుతున్నాడు.
భారత జట్టు బలం
ఈ విభాగంలో భారత్ నుంచి ముగ్గురు అథ్లెట్లు పోటీపడుతున్నారు. నీరజ్ చోప్రా మాత్రమే కాకుండా రోహిత్ యాదవ్, యష్ వీర్ సింగ్ లు కూడా కామన్వెల్త్ క్రీడల్లో పోటీపడుతున్నారు. ఏ దేశానికి లేని విధంగా భారత్ కు ముగ్గురు అత్యుత్తమ త్రోయర్లు ఉండటం కలిసొచ్చే అంశం.
పోటీల షెడ్యూల్ వివరాలు
క్వాలికేషన్ రౌండ్: జులై 30న ఉదయం 10.00 గంటలకు(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు)
ఫైనల్ పోరు: జులై 31న ఉదయం 10.00 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు)గ్లాస్గోలోని స్కాట్ స్టన్ స్టేడియంలో జరగనుంది.












Click it and Unblock the Notifications