టీమిండియా విక్టరీ పరేడ్‌లో అపశృతి
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచిన టీమిండియా స్వదేశీ గడ్డపై అడుగుపెట్టింది. తుఫాన్ ప్రభావం వల్ల నాలుగు రోజుల పాటు వెస్టిండీస్‌లోని బార్బడొస్‌లోనే చిక్కుకుపోయిన రోహిత్ సేన గురువారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఆ తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోవడం, అక్కడి నుంచి ముంబైకి రావడం చకచకా సాగిపోయాయి.
టీమిండియా ముంబైలో అడుగు పెట్టిన సందర్భంగా విక్టరీ పరేడ్‌ను నిర్వహించింది బీసీసీఐ. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖెడే స్టేడియం వరకు సాగిందీ పరేడ్. మెరైన్ డ్రైవ్, చర్చ్‌గేట్, నారిమన్ పాయింట్, కొలాబా మీదుగా ఓపెన్ టాప్ బస్‌లో ట్రావెల్ చేశారు. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పటేల్.. ఇలా టీమ్ మొత్తం ఇందులో పాల్గొంది.

వారిని చూడ్డానికి లక్షలాదిగా తరలివచ్చారు ముంబైకర్స్. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖెడే స్టేడియం వరకు బారులు తీరారు. జాతీయ పతాకాలను చేతపట్టుకుని, టీమిండియా జెర్సీని ధరించిన అభిమానులు ఓ సముద్రంలా పోటెత్తారు. మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే మెరైన్ డ్రైవ్‌లోనే అభిమానుల సందడి అధికం.
ఈ విక్టరీ పరేడ్‌లో అపశృతి చోటు చేసుకుంది. మెరైన్ డ్రైవ్‌లో స్వల్పంగా తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో కొందరు అభిమానులు గాయపడ్డారు. మరో 10 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులనను ఎదుర్కొన్నారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన వారిలో ఇద్దరికి ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్లు వెల్లడించారు.

విక్టరీ పరేడ్ వెళ్లిపోయిన తరువాత మెరైన్ రోడ్‌లో ఎక్కడ చూసినా తెగిపోయిన చెప్పులే కనిపించాయి. ఆ మార్గంలో పార్క్ చేసి ఉంచిన పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొన్నింటి విండ్ స్క్రీన్లు, అద్దాలు పగిలాయి. వాహనాల రాకపోకలను నియంత్రించడానికి ముంబై ట్రాఫిక్ పోలీసులు అమర్చిన ఇనుప బ్యారికేడ్లతో పాటు కొన్ని స్తంభాలు సైతం విరిగిపోయాయంటే అభిమానుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
లక్షలాదిగా అభిమానులు చేరుకోవడం మెరైన్ డ్రైవ్‌లో పోలీసులు సైతం చేతులెత్తేసినట్టయింది. ఇంత భారీ సంఖ్యలో వస్తారని పోలీసులు ఊహించి ఉండకపోవచ్చని రవి సోలంకి అనే అభిమాని చెప్పాడు. తోపులాటలో తాను కింద పడ్డానని, అదృష్టవశావత్తూ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డానని వ్యాఖ్యానించాడు. ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా విక్టరీ పరేడ్‌ను నిర్వహించడంలో పోలీసులు విఫలం అయ్యారని చెప్పాడు.












Click it and Unblock the Notifications