సీట్ ఎడ్జ్ మ్యాచ్: జర్మనీకి బిగ్ షాక్ ఇచ్చిన పసికూన
ఫిఫా వరల్డ్ కప్ లో అద్భుతం చోటు చేసుకుంది. గ్రూప్-ఈ లో భాగంగా న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఈక్వెడార్ తిరుగులేని విజయాన్ని అందుకుంది. తనకంటే ఎన్నో రెట్లు బలమైన ప్రత్యర్థి జర్మనీని మట్టికరిపించింది. 2-1 గోల్స్ తేడాతో ఓడించి నూతన చరిత్ర సృష్టించింది. ఈ అసాధారణ విజయంతో ఈక్వెడార్ జట్టు టోర్నమెంట్ రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ దశకు అర్హత సాధించింది. నాకౌట్స్ లోకి ప్రవేశించింది.
మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు ఆధిపత్యం కోసం తీవ్రంగా పోరాడటంతో ఆద్యంతం అత్యంత రసవత్తరంగా సాగిందీ మ్యాచ్. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే జర్మనీ వింగర్ లెరాయ్ సనే క్లినికల్ గోల్‌తో తన జట్టుకు ఊహించని మెరుపు ఆధిక్యాన్ని అందించాడు. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ప్లే మేకర్ ఫ్లోరియన్ విర్ట్జ్ అందించిన అసిస్ట్ కంటే ముందు మిడ్‌ఫీల్డర్ అలెగ్జాండర్ పావ్లోవిచ్ ఫౌల్ చేశారంటూ ఈక్వెడార్ ప్లేయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెఫరీ ఆ గోల్‌ను ఆమోదించడంతో జర్మ నీ ఆధిపత్యం కొనసాగింది.

అయినప్పటికీ, ఏమాత్రం కుంగిపోని ఈక్వెడార్ వీరోచితంగా పోరాడింది. మ్యాచ్ 9వ నిమిషంలో నిల్సన్ అంగులో గోల్ సాధించాడు. తోటి ప్లేయర్ అందించిన పాస్ ను జర్మనీ మేటి గోల్‌కీపర్ మాన్యుయెల్ నోయర్ ను దాటిస్తూ అద్భుతమైన రీతిలో గోల్‌గా మార్చడంతో స్కోర్ సమం అయింది. మరో గోల్ కోసం రెండు జట్లు కూడా కొదమసింహాల్లా పోరాడాయి. ద్వితీయార్ధంలో కూడా నరాలు తెగే ఉత్కంఠతతో సాగింది.
జర్మనీ ఫార్వర్డ్ ప్లేయర్ కై హావర్ట్జ్‌పై ఫౌల్ జరిగిందనే కారణంతో జర్మనీకి పెనాల్టీ ప్రకటించారు. వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) సమీక్ష అనంతరం ఆ పెనాల్టీ నిర్ణయాన్ని రద్దు చేసింది. అంతకుముందు బిల్డప్ దశలో లెరాయ్ సనే ఫౌల్ చేసినట్లు నిరూపితం కావడమే అందుకు ప్రధాన కారణం. ఈ సమయంలో ఈక్వెడార్ కోచ్ సెబాస్టియన్ బెక్సాసెస్ ఒక అద్భుతమైన వ్యూహాత్మక మార్పు చేశారు. ఆయన మైదానంలోకి పంపిన అటాకింగ్ ఫార్వర్డ్ కెవిన్ రోడ్రిగ్జ్ తన ఎగ్రెసివ్ దూకుడుతో జర్మనీ రక్షణ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
వరుస ప్రతిదాడులతో ఒత్తిడి పెంచిన ఈక్వెడార్‌కు 77వ నిమిషంలో అద్భుత అవకాశం లభించింది. చక్కటి కార్నర్ కిక్ ద్వారా దూసుకొచ్చిన బంతిని కెవిన్ రోడ్రిగ్జ్ తన తలతో గోల్ పోస్ట్ వైపు పాస్ చేశాడు. గొంజాల్లో ప్లాటా దానిని మెరుపువేగంతో గోల్ పోస్ట్ లోకి పంపాడు. దీంతో ఈక్వెడార్ 2-1 తేడాతో పైచేయి సాధించింది. మ్యాచ్ నిమిషంలో ప్లాటా ఎల్లో కార్డ్ పొందినప్పటికీ విజయానికి అది ఏ మాత్రం కూడా అడ్డంకి కాలేదు. చివరి నిమిషాల్లో ఈక్వెడార్ డిఫెండర్లు జర్మనీ దాడులను అడ్డుకుని చరిత్రను లిఖించారు.
దీంతో 55,000 మందికి పైగా హాజరైన ఈక్వెడార్ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండాపోయింది. ఈ మ్యాచ్ లో ఓడినా గ్రూప్-ఈ లో జర్మనీ ఆరు పాయింట్లతో టేబుల్ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. ఈ విజయం ద్వారా ఆర్జించిన నాలుగు పాయింట్లతో ఈక్వెడార్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. టోర్నీలో అత్యుత్తమ మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది జట్లలో ఒకటిగా నిలిచి రౌండ్ ఆఫ్ 32 పోరుకు అధికారిక అర్హతను పొందింది.












Click it and Unblock the Notifications