రిషభ్ పంత్ దారెటు..?
Rishabh Pant: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కూడా కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగడమే దీనికి కారణం.
ఈ క్రమంలో ఆయా జట్లన్నీ కూడా ఇప్పటికే తమ రిటెన్షన్ ప్లేయర్ల వివరాలను వెల్లడించాయి కూడా. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్ ఆకట్టుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్, కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సహా అయిదు మంది స్టార్ ప్లేయర్లు, ఆల్‌రౌండర్లు, గెలపుగుర్రాలను అట్టి పెట్టుకుంది.

ధోనీతో పాటు రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు, మథీషా పథిరన- రూ.13 కోట్లు, శివం దుబే- 12 కోట్లు, రవీంద్ర జడేజా- 18 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. ధోనీని అన్ క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్‌లోకి చేర్చింది. నాలుగు కోట్ల రూపాయలతో అతన్ని రిటైన్ చేసుకున్నట్లు వెల్లడించింది.
మరో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను కూడా వదులుకుంది చెన్నై సూపర్ కింగ్స్. 2023 సీజన్‌లో సీఎస్‌కే తరఫు కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు స్టోక్స్. ఆ తరువాత గాయం కారణంగా సీజన్ మొత్తానికీ దూరం అయ్యడు. అతని గైర్హాజర్ ఆ సీజన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ ఏడాది కూడా అతను డుమ్మా కొట్టాడు.
అదే సమయంలో ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ సందర్భంగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ గట్టిగా పోటీ పడొచ్చంటూ వార్తలొస్తోన్న విషయం తెలిసిందే. ఈ లెప్ట్ హ్యాండర్ డాషింగ్ బ్యాటర్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

దీనిపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని తేల్చి చెప్పారు. వేలం పాట కోసం రిజర్వ్ చేసుకున్న పర్స్ అమౌంట్ తక్కువగా ఉంటోందని, టీమిండియా ప్లేయర్ల కోసం పోటీ పడలేమని తేల్చి చెప్పారు. మెగా ఆక్షన్ సందర్భంగా ఎలా వ్యవహరించాలనే విషయంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
ఓ యూట్యూబ్ ఛానల్ కోసం సీఎస్‌కే మాజీ బ్యాటర్ అంబటి రాయుడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాశీ విశ్వనాథన్ మాట్లాడారు. జట్టులో చేరికల గురించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కేప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో చర్చించాల్సి ఉంటుందని, రిటెన్షన్ సందర్భంగా అలాంటి చర్చలే సాగించామని పేర్కొన్నారు.
రిటెన్షన్ తరువాత సీఎస్‌కే వద్ద 55 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంది. రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్లు పోగా మిగిలిన ఈ 55 కోట్ల రూపాయలతో మిగిలిన జట్టు ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంటుంది సీఎస్‌కేకు.












Click it and Unblock the Notifications