పాకిస్తాన్ కు చుక్కలు చూపిన సౌరబ్ గంగూలీ
టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించడం వివాదాలకు కేంద్రబిందువు అయింది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ కో హోస్ట్ శ్రీలంక సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డును అభ్యర్థించింది గానీ పెద్దగా ఫలితం కనిపించట్లేదు. పట్టిన పట్టు వీడట్లేదు. భారత్ తో ఆడదలచుకోలేదంటూ స్వయానా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫే ప్రకటించారంటే- దీన్ని ఆ దేశం ఎంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భాగంగా ఈ నెల 15వ తేదీన భారత్‌ను ఢీ కొనాల్సి ఉంది పాకిస్తాన్. శ్రీలంక కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం దీనికి వేదిెక. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ గతంలోనే నిర్ణయం తీసుకుంది. లీగ్ దశలో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ లన్నింటినీ కూడా బాయ్ కాట్ చేసినట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయానా ప్రకటించారు.

ఈ వ్యవహారంపై శ్రీలంక స్పందించింది. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలన్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఈ మ్యాచ్ రద్దయితే భారీ ఆర్థిక, పర్యాటక నష్టాలు వాటిల్లుతాయని పేర్కొంది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు తమ దేశంలో అత్యంత ఆదరణ ఉంటుందని, ఇది రద్దయితే టికెట్లు అమ్ముడుపోవని, స్పాన్సరర్లు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ ను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలివస్తారని, పర్యాటకరంగం కూడా నష్టపోతుందని పేర్కొంది.
తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ.. ఈ వ్యవహారంపై స్పందించారు. భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ చేయాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. అర్థం పర్థం లేనిదని వ్యాఖ్యానించారు. వరల్డ్ కప్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలే తప్ప లేని పోని భయాలను వంటపట్టించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయాలు, చర్యలు.. క్రీడాస్ఫూర్తిని దెబ్బతీస్తాయని అన్నారు.
భద్రత కారణాలతో భారత్ లో ఆడట్లేదని పాకిస్తాన్ క్రికెట్ వితండవాదం చేస్తోందని సౌరబ్ గంగూలీ అన్నారు. నిజానికి- ఈ మ్యాచ్ జరిగేది శ్రీలంకలో అని గుర్తు చేశారు. ఏ పాయింట్ మీద పాకిస్తాన్.. భారత్ తో మ్యాచ్ ఆడటానికి వెనుకంజ వేసిందో అర్థం కావట్లేదని చెప్పారు. ఈ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఈ టోర్నమెంట్ లో ప్రతి పాయింట్ కూడా అత్యంత కీలకంగా మారుతుందని, అలాంటప్పుడు పాకిస్తాన్ ఈ మ్యాచ్ ను బహిష్కరించడం అర్థం లేనిదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications