సిరాజ్ తర్వాత డీఎస్పీగా..!!
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025లో భారత జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన దీప్తి శర్మకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అభినందించింది. ఈ ఏడాది జనవరిలో డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ గా అపాయింట్ అయిన దీప్తి శర్మపై అభినందనల వర్షాన్ని కురిపించింది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. యూపీ పోలీస్ శాఖకు గర్వకారణం అయ్యారని ప్రశంసించారు. మహ్మద్ సిరాజ్ తర్వాత డీఎస్పీగా నియమితులైన మరో క్రికెట్ ఆమెనే.
ఫైనల్‌లో దీప్తి శర్మ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణించారు. హాఫ్ సెంచరీతో పాటు అయిదు వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును అందుకున్నారు. ఆమె అద్భుత ప్రదర్శన దేశానికి, ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఎంతో గర్వకారణమని, ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 గెలవడంలో దీప్తి శర్మ ఆదర్శనీయంగా, చరిత్రలో నిలిచిపోయేలా ఆడారని యూపీ డీజీపీ అభినందించారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న "కుశల్ ఖిలాడి యోజన" కింద ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో డీఎస్పీగా పని చేస్తోన్నారని గుర్తు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌లో దీప్తి శర్మ 215 పరుగులు చేసి, 22 వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన కనపర్చారని ప్రశంసించారు. దేశానికి, రాష్ట్రానికి, ఉత్తరప్రదేశ్ పోలీసులకు గర్వకారణం అయ్యారని చెప్పారు. స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులైన దీప్తి శర్మకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తోన్నానని డీజీపీ తెలిపారు.
28 ఏళ్ల దీప్తి శర్మ విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ లో చరిత్ర నెలకొల్పారు. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించారు. అనంతరం అయిదు వికెట్లు పడగొట్టారు. తొలుత హాఫ్ సెంచరీ, అనంతరం బౌలింగ్ లో అయిదు వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్ గా నిలిచారు. ఆగ్రాకు చెందిన ఈ ఆల్‌రౌండర్ వరల్డ్ కప్ లో బ్యాటింగ్ లో 215 పరుగులు, బౌలింగ్ లో 22 వికెట్లు పడగొట్టారు. 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును సొంతం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications