నో విరాట్ కోహ్లీ, నో కేఎల్ రాహుల్..!!
Virat Kohli and KL Rahul: ఇంగ్లాండ్ సిరీస్‌కు భారత జట్టు సన్నద్ధమౌతోంది. అయిదు టీ20 ఇంటర్నేషనల్స్, మూడు వన్డే మ్యాచ్‌లతో కూడుకున్న సిరీస్ ఇది. తొలి టీ20 ఈ నెల 22వ తేదీన ఆరంభం కాబోతోంది. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక. ఈ సిరీస్‌లో ఆడే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే ప్రకటించింది కూడా.
ఈ ఫార్మట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు. గాయం వల్ల చాలాకాలం పాటు జట్టుకు దూరంగా ఉంటూ వచ్చిన మహ్మద్ షమీతో పాటు టీ20 ఆడే రెగ్యులర్ ప్లేయర్లందరూ జట్టులో చోటు దక్కించుకున్నారు.

దీని తరువాత వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ ఉంటుంది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన నాగ్‌పూర్‌లో ఆరంభమౌతుంది. 9న కటక్, 12న అహ్మదాబాద్‌లో మిగిలిన వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ విరాట్ కోహ్లీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో అంచనాలను అందుకోలేకపోయిన నేపథ్యంలో ఇక్కడ సత్తా చాటాల్సిన పరిస్థితుల్లో పడ్డాడు కోహ్లీ.
ఈ నేపథ్యంలో ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి ఈ నెల 23వ తేదీ నుంచి జరగబోయే రంజీ ట్రోఫీల్లో ఆడాలని ఇదివరకే నిర్ణయించుకున్నాడు. తన సొంత టీమ్ ఢిల్లీకి ప్రాతినిథ్యాన్ని వహించాల్సి ఉంది. తొలి రెండు మ్యాచ్‌లల్లో అందుబాటులో ఉంటానంటూ బీసీసీఐకి సమాచారం సైతం ఇచ్చాడు.
ఇప్పుడు పరిస్థితులు అడ్డం పడినట్టే కనిపిస్తోంది. అనారోగ్య కారణాలతో రంజీలను కోహ్లీ ఆడదలచుకోలేదని తెలుస్తోంది. మెడ నొప్పి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తోన్నాయి. మెడ నొప్పి, ఇతర ఫిట్‌నెస్ సమస్యల వల్ల రంజీలకు దూరమౌతానంటూ బీసీసీఐకి వెల్లడించినట్లు తెలుస్తోంది.
అటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం రంజీలకు దూరం అయ్యాడని అంటున్నారు. కర్ణాటక తరఫున అతను రంజీల్లో ఆడాల్సి ఉంది. మోచెయ్యి వాపుతో కొద్దిరోజులుగా అతను బాధపడుతున్నాడని చెబుతున్నారు. వీరిద్దరు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్నారు. ఈ క్రమంలో కొంత విశ్రాంతి అవసరమని భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications