Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాయకరావుపేట: జగన్ నిలబడతారా, టిడిపికా?

Payakaraopet: Will Jagan win?
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ఉంది. పేటలో పాగా వేసేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అభివృద్ధి, జగన్ అవినీతి ఎజెండాతో కాంగ్రెస్ ముందుకు సాగుతున్నది. కాంగ్రెస్ హయాంలోని అవినీతిని ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రత్యర్థులకు టిడిపి ముచ్చెమటలు పట్టిస్తున్నది.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తున్నదనే సింగిల్ పాయింట్ సెంటిమెంట్ ఫార్ములాతో జగన్ పార్టీ ప్రచారం చేస్తోంది. అభ్యర్థులు ముగ్గురూ మాజీ ఎమ్మెల్యేలు కావడంతో గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా గంటెల సుమన, టిడిపి అభ్యర్థిగా చెంగల వెంకట్రావు, జగన్ పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బరిలో నిలిచారు. ఇది ఎస్సీ రిజర్వు స్థానం అయినా.. కాపు, వెలమ, మత్స్యకార ఓటర్లే అధికం. అభ్యర్థి గెలుపును నిర్ణయించేదీ వారే. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను తమవైపు తిప్పుకోడానికి మూడు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

పాయకరావుపేటలో టిడిపి ఆవిర్భావం తర్వాత ఎక్కువసార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇదే పార్టీ నుంచి గంటెల సుమన, కాకర నూకరాజు, చెంగల వెంకట్రావు గెలుపొందారు. 2009 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని దక్కించుకుంది. నాటి విజేత గొల్ల బాబూరావు జగన్ వర్గంలో చేరి అనర్హత వేటుకు గురి కావడంతో ఉపఎన్నిక వచ్చింది. బాబూరావునే వైఎస్సార్సీపీ బరిలోకి దించింది. ఇక్కడి నుంచి గతంలో రెండుసార్లు గెలిచిన చెంగల వెంకట్రావును టిడిపి అభ్యర్థిగా నిలిపింది. కాంగ్రెస్ కొంత జాప్యం చేసినా.. చివరకు మాజీ ఎమ్మెల్యే గంటెల సుమనను పోటీలోకి దించింది.

ఎన్నికలు అనివార్యమని గుర్తించిన టీడీపీ.. అందరికంటే ముందుగానే ప్రచారంపై దృష్టిపెట్టింది. అభ్యర్థిగా చెంగలను ముందే ప్రకటించడం వారికి కలిసొచ్చిన అంశం. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో పార్టీ స్థితిగతులను సమీక్షించి, వాటి ఆధారంగా వ్యూహాన్ని రూపొందించుకున్నారు. ముందుగా పార్టీ అధినేత చంద్రబాబుతో నియోజకవర్గ పర్యటన ఏర్పాటుచేశారు. తర్వాత కూడా బాబు పర్యటించారు. ఈ నెల నాలుగో తేదీన మరోసారి ఆయన పాయకరావుపేట ప్రచారానికి రానున్నారు. ఎంపీ సుజనా చౌదరికి నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. మండలాల నుంచి బూత్‌స్థాయి వరకు అన్నిచోట్లా దృష్టి కేంద్రీకరించారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమైన తర్వాత.. అంతకుముందు అక్కడకు వలసవెళ్లిన తెలుగు తమ్ముళ్లను సొంత గూటికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో చాలా జాప్యం, తర్జనభర్జన జరిగాయి. సీఎం కిరణ్ మూడుసార్లు, పీసీసీ చీఫ్ బొత్స, ఎంపీ ఝాన్సీ తదితరులు ప్రచార బాధ్యతలు స్వీకరించారు. దీంతో కాంగ్రెస్ ప్రచారం ఒక్కసారిగా పుంజుకుంది. ప్రత్యర్థి పార్టీ వ్యూహాన్ని కాంగ్రెస్ కూడా అనుసరిస్తోంది. బూత్‌స్థాయి ఓటింగ్‌పైనే అందరూ దృష్టి పెట్టాలని పార్టీ వర్గాలు సూచించాయి.

వైఎస్సార్సీపీ తరఫున గతంలో జగన్ ప్రచారానికి వచ్చారు. తర్వాత ఆయన జైలుకు వెళ్లడంతో వైఎస్ విజయలక్ష్మి ఎన్నికల ప్రచారం చేశారు. ఇక్కడ పార్టీకి పెద్దదిక్కుగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ కూడా ప్రత్యర్థులకు తీసిపోని విధంగా ప్రచారం సాగిస్తున్నది. సీపీఎం అభ్యర్థి లోకనాథం, బీజేపీ అభ్యర్థి చక్రవర్తి కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు.

ఈ దఫా ఎన్నికల్లో ప్రత్యేక ఎజెండాలతో పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో మరో వందకోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రచారంలో వినియోగించుకుంటోంది. తమ ఓట్లను వైఎస్సార్సీపీ చీల్చుకునే అవకాశం ఇవ్వకూడదని పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు కుల సమీకరణాలను కూడా ఉపయోగిస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ అవినీతిని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేస్తూ టీడీపీ ప్రచారం చేస్తోంది. నక్కపల్లి మండలంలో పారిశ్రామికీకరణ పేరిట సాగించిన బలవంతపు భూసేకరణ, ఇతర ఉద్యమాలను ఆసరా చేసుకుని విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ వర్గాలు ముందుకెళ్తున్నాయి. పీఆర్పీలోకి వెళ్లిన కేడర్‌ను మళ్లీ పార్టీలోకి తెచ్చేందుకు ఒక సామాజిక వర్గం నేతలను రంగంలోకి దించింది. ఇతర ప్రధాన సామాజిక వర్గాలను తమవైపు తిప్పుకోవడానికి ఆయా సామాజిక వర్గాల పెద్దలను రంగంలోకి దించిం ది.

జగన్ అరెస్టును ప్రజల ముందుంచి సానుభూతి పొందాలని, తద్వారా విజయం చేజిక్కించుకోవాలని వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, టీడీపీల నుంచి చీలే ఓట్లపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఈ నియోజకవర్గంలో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలు వున్నాయి. మండలాల్లో ఓటింగ్ సరళిపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+