• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కుమ్ములాటలు: వైయస్ జగన్ పార్టీ కుతకుత

By Pratap
|
YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులో అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏయే జిల్లాల్లో ఈ కుమ్ములాటలు పెచ్చరిల్లుతున్నాయో క్రోడీకరించి ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. ఆ వార్తాకథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక జగన్ పార్టీలోని అంతర్గత విభేదాలు, కుమ్ములాటలపై సవివరమైన కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక కథనం ప్రకారం - కుమ్ములాటల తీరు ఈ విధంగా ఉంది.

శ్రీకాకుళం: జిల్లాలో కణితి విశ్వనాథం, పాలవలస రాజశేఖర్ వైసీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు. వారు అడ్డు చెప్పినా ఎస్వీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మైసూరా రెడ్డిలను సంప్రదించి ఇటీవల కొందరు వైయస్సార్ కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చిన ఇచ్చాపురం ఎమ్మెల్యే సాయిరాజ్, పాతపట్నానికి చెందినకలమట వెంకటరమణలకు ఇన్‌చార్జి బాధ్యతలు కూడా ఇచ్చారు. పార్టీలో మరో సీనియర్ ఎంవీ కృష్ణారావుకు మొండిచేయి చూపారు. దీంతో ఇక్కడ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీలో ఇటీవలి పరిణామాలపై నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

విజయనగరం: సమన్వయకర్తల నియామకంలో తూర్పు కాపు, ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం జిల్లాలో చిచ్చురేపింది. పార్టీ నేతల తీరుపై ఆయా సామాజిక వర్గాలు ఉడికిపోతున్నాయి. కొంతమంది ఇప్పటికే రాజీనామాకు సిద్ధపడ్డారు. మరికొంతమంది హైకమాండ్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి హైదరాబాద్ పయనమయ్యారు.

విశాఖపట్నం: పార్టీని స్థాపించిన నాటి నుంచీ నమ్ముకుని ఉన్నవారిని పక్కనపెట్టి.. కొత్తగా వచ్చిన వారికి సమన్వయ బాధ్యతలు ఇవ్వడం విశాఖ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కలతలు రేపింది. జిల్లా నేతలను సంప్రదించకుండా రాత్రికి రాత్రి పేర్లను ప్రకటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జగన్ కంటే ప్రజారాజ్యం పార్టీని నడిపిన చిరంజీవే నయమని విమర్శిస్తున్నారు. గతంలో పీఆర్పీలో పని చేసినవారు అక్కడ జగన్ పార్టీలో చేరారు. ఇక్కడ కూడా వారికి మొండి చేయే ఎదురైంది. జిల్లాలో సమన్వయకర్తల నియామకంలో ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్న కొణతాల రామకృష్ణ, మరో వర్గ నేత, ఎంపీ సబ్బం హరిలను కూడా సంప్రదించలేదని సమాచారం. సబ్బం హరి వర్గంగా ముద్రపడిన పలువురికి సమన్వయకర్తల ఎంపికలో మొండి చేయి చూపారు.

తూర్పు గోదావరి: అనపర్తి నియోజకవర్గంలో పేరున్న డాక్టర్ సూర్యనారాయణరెడ్డి వైయస్సార్ కాంగ్రెసులో చేరే ముందే టికెట్ హామీ పొందినట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు అనపర్తి నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో సూర్యనారాయణరెడ్డి ఆందోళనలో పడ్డారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరామారావు తన కుమారుడు వెంకటరమణ చౌదరికి రాజమండ్రి పార్లమెంటు టికెట్ కోసం ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసులో చేరారు. ఆయన రాకకు కొంతమంది నేతలు అభ్యంతరం చెప్పారు. ఆయన వస్తే తాము పార్టీలో ఇమడలేమన్న సంకేతాలు జగన్, ఇతర నేతలకు పంపారు. ఇక రాజమండ్రి వైయస్సార్ కాంగ్రెసులో నాలుగైదు గ్రూపులు కొనసాగుతున్నాయి. రాజమండ్రి సిటీ టికెట్ హామీ వచ్చిందంటూ బొమ్మన రాజ్‌కుమార్ ప్రచారం చేస్తుంటే.. ఆయనను కాదని యువ పారిశ్రామికవేత్తకు టికెట్ ఇస్తున్నారంటూ మరో వర్గం ప్రచారం చేస్తోంది.

పశ్చిమ గోదావరి: ఏడాది కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నవారికి మిగిలింది అసంతృప్తి, ఆగ్రహమే. టిడిపి నుంచి వైదొలిగి జగన్ పార్టీలోకి వచ్చిన కృష్ణబాబుకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురికి సమన్వయ బాధ్యత అప్పగించి జాబితా విడుదల చేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం పెల్లుబుకింది. ఈ విషయంపై నిలదీయడానికి కొందరు నేతలు శుక్రవారం హైదరాబాద్ వెళ్లారు. దెందులూరు నియోజకవర్గంలో ఈ మధ్యనే అనిల్‌ను తీసుకువచ్చి భారీ సభ నిర్వహించినా, ఇక్కడి సీటు ఆశిస్తున్న చంద్రమౌళికి కనీసం నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించలేదు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి పార్టీలో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్‌కు నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తూనే ఆయనకు మరో ఆశావహుడు కర్రా రాజారావును తోడు కలిపారు. దీనిపై కూడా ఆ నియోజకవర్గంలో అసంతృప్తికి బీజం వేసింది.

గుంటూరు జిల్లా: సత్తెనపల్లి టికెట్ తనదేనంటూ అంబటి రాంబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నలంద విద్యా సంస్థల అధినేత వరప్రసాద్‌రెడ్డి పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పొన్నూరు టికెట్ ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణకు ఖాయమని ప్రచారం జరుగుతోంది. దాన్ని తమకు ఇవ్వాలంటూ నియోజకవర్గానికి చెందిన లీలాధర్, యాసిన్ పట్టుబడుతున్నారు. బాపట్ల సీటు కోన రఘుపతికి ఖాయమని ప్రచారం జరుగుతుండగా ఆయనకు ఇవ్వడానికి వీలు లేదని నియోజకవర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ సీటు కోసం టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కుమార్తె సుధ రంగంలో ఉన్నారు. కానీ, తిరుమల మిల్క్ డెయిరీ అధినేత బొల్లా బ్రహ్మనాయుడు పార్టీలో చేరడంతో ఆమె ఆశలు చేజారే పరిస్థితి వచ్చింది. అదే సీటు తనకు కేటాయించాలంటూ నలబోలు విష్ణు కూడా పావులు కదుపుతున్నారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేకపాటి సోదరుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో సాగుతోంది. వెంకటగిరి ఇన్‌చార్జి బాధ్యతలు చేపడుతున్నట్లు ఇటీవల ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు ప్రకటించుకోవడం వీరి మధ్య రగడకు కారణమైంది. టికెట్లు ఇచ్చేది జగన్ అని గుర్తుంచుకోవాలంటూ సమావేశానికి హాజరైన కాకాణితో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మందలింపు ధోరణితో మాట్లాడారు. వెంకటగిరిలో ఇన్‌చార్జుల పెత్తనంపై లక్ష్మయ్యనాయుడు, నెమల్లపూడి సురేష్ కుమార్ వర్గీయులు బహిరంగంగానే ఘర్షణకు దిగారు.

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మధ్య కూడా వివాదాలు నడుస్తున్నాయి. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్న కాకాణి అడ్డు పడ్డారు. ఇక ఇటీవల పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి నిర్వహించిన సమావేశానికే కాకాణి వర్గం గైర్హాజరైంది. మేకపాటి సోదరులు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి తెలియాలనే డుమ్మా కొట్టినట్లు చర్చించుకుంటున్నారు.

కర్నూలు జిల్లా: సభ్యత్వ నమోదుకు సంబంధించి కేంద్ర కమిటీ సభ్యుడు భూమా నాగిరెడ్డి చెప్పినట్టు తాము ఎందుకు నడుచుకోవాలంటూ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలు రమాదేవి సమావేశంలో నిలదీసినట్టు సమాచారం. దీంతో ఆగ్రహించిన భూమా పార్టీ ఆదేశాలు అమలు చేయలేని వారు పార్టీని విడిచి వెళ్లాలని చెప్పినట్లు సమాచారం. మరోవైపు పార్టీ ముస్లిం మైనార్టీలకు సరైన ప్రాధాన్యం లేకుండాపోయిందని ఆ పార్టీకి చెందిన మరో ముస్లిం నేత మండిపడినట్టు తెలిసింది. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డిని నామమాత్రం చేసి జిల్లాకు చెందిన కొందరు నేతలు పెత్తనం చేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా: దశాబ్దాల కాలంగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని ఎమ్మెల్యేలు అమరనాధరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. చేరిన తొలి రోజుల నాటి ఉత్సాహం వీరిలో ఇప్పుడు కనిపించడం లేదు. తన నియోజకవర్గంతోపాటు సత్యవేడు వరకు సుడిగాలిలా పర్యటించిన అమరనాధరెడ్డి జాడే కనిపించడం లేదు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితీ ఇంతే. తంబళ్లపల్లిలో పార్టీ సమన్వయకర్త కలిచర్ల ప్రభాకరరె డ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

సీఎం పిలిస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతానంటున్నారు. మదనపల్లె సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీ తిప్పారెడ్డి, షమీమ్ అస్లామ్‌లను ప్రకటించారు. దీంతో అసంతృప్తి సెగలు ఆరంభమయ్యాయి. ఇక, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశ పడుతున్న చంద్రగిరిలో పరిస్థితి మరీ దారుణం. చెవిరెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేస్తూనే ఉంది. ఈ వర్గం వెనుక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందనే ప్రచారం ఉంది. మొదట్లో చెవిరెడ్డికి చెక్ పెట్టేందుకు తన కుమారుడినే తెరమీదకు భూమన తెచ్చారు. జగన్ జోక్యంతో అది ఆగింది. ఇక, ఇటీవలి ఎమ్మెల్సీ, సహకార ఎన్నికల్లోనూ వైసీపీ విజయం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు. కిరణ్‌పై వ్యతిరేకతతో వైయస్సార్ కాంగ్రెసుకు దగ్గరగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే జిల్లాలో తగాదాలు ఇంకా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి.

అనంతపురం: ఈ జిల్లాలో సమన్వయకర్తల ఎంపికపై సామాజిక న్యాయం ఎక్కడుందంటూ ముఖ్య నేతలే తప్పుబడుతున్నారు. పార్టీ కోసం క్రియాశీలంగా పని చేస్తున్న కార్యకర్తలను విస్మరిస్తున్నారంటూ కదిరి కార్యకర్తలు జిల్లా ఇన్‌చార్జి భూమా నాగిరెడ్డిని నిలదీయటం పార్టీలో వర్గపోరును తేటతెల్లం చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు జాతీయ కమిటీ సభ్యురాలు కవిత గత కొంతకాలంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. హిందూపురంలో ఇనయతుల్లా పేరు వినిపించగానే ఇప్పటివరకు పని చేస్తున్న ముగ్గురు నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదుచేసి వచ్చారు. పార్టీ కార్యకలాపాలకు ఖర్చుపెట్టుకుని పనిచేస్తున్న తమను కాదని ఆయన్నెలా ఎంపిక చేస్తారని ప్రశ్నించినట్లు సమాచారం.

కడప జిల్లా: జగన్ సొంత జిల్లాలోనూ ఆయన పార్టీలో విభేదాల కుంపటి రగులుతోంది. మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జ్ రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. కడప నియోజకవర్గ సమన్వయకర్తగా అంజాద్‌బాషను ప్రకటించినా ఆయనతోపాటు రవీంద్రనాథ్ రెడ్డిని కూడా ప్రకటించడం చర్చనీయాంశ మైంది. కమలాపురం నుంచి రవీంద్రనాథ్‌రెడ్డి పోటీ చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇక్కడ వైయస్ రాజశేఖర రెడ్డికి తోడల్లుడు వరుస అయిన మల్లికార్జునరెడ్డి కూడా ఇన్‌ఛార్జ్ స్థానాన్ని ఆశించారు. ఇప్పుడు అసంతృప్తికి గురైన ఆయన తన అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. జమ్మలమడుగు ఇన్‌ఛార్జ్‌గా ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డితోపాటు సూర్యనారాయణ రెడ్డి, ఆర్.ప్రసాద్‌రెడ్డిలను నియమించారు. దీంతో ఇక్కడి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబం వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

ఖమ్మం జిల్లా: జిల్లాలో సీపీఐ అగ్రనేత పువ్వాడ నాగేశ్వరరావు తనయుడు అజయ్‌కుమార్ వైయస్సార్ కాంగ్రెసు ఆవిర్భావం నుంచే జిల్లాలో తనకంటూ క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాకతో ఇద్దరి అనుచరులకూ పడటం లేదు. భద్రాచలం నియోజకవర్గంలో జలగం అనుచరులను పదవుల నుంచి తప్పించి పువ్వాడ అనుచరులకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల యువజన కన్వీనర్ నియామకంపై జలగం వర్గీయులు బహిరంగంగా నిరాహార దీక్ష చేశారు. పాలేరు నియోజకవర్గం పార్టీలో కూడా రెండు వర్గాలున్నాయి.

నిజామాబాద్: జిల్లాలో బాజిరెడ్డి గోవర్ధన్, కేశ్‌పల్లి గంగారెడ్డి ఒక గ్రూపు కాగా మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి మరో గ్రూపు. కాంగ్రెస్‌కు చెందిన జడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని బాజిరెడ్డి వైయస్సార్ కాంగ్రెసులోకి తీసుకొచ్చారు. ఆయన ఎల్లారెడ్డి టికెట్ ఆశించారు. కానీ బాజిరెడ్డి ఇప్పుడు సిద్ధార్థ్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నారనే ప్రచారం ఉంది. వెంకటరమణారెడ్డి, సిద్ధార్థ రెడ్డి గ్రూపుల మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. సంతోష్‌రెడ్డి, బాజిరెడ్డి మధ్యలో గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఉన్న విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆర్మూర్ టికెట్ తన తనయుడికి దక్కాలని సంతోష్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. దీనిని అడ్డుకునేందుకు బాజిరెడ్డి ఎత్తులు వేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా: నిర్మల్‌లో మొదటి నుంచీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ముల వినాయక్ రెడ్డి పని చేస్తున్నారు. మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీలో చేరడంతో వినాయక్ రెడ్డికి పదవులు దక్కే అవకాశం లేదు. సీనియర్ న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి పార్టీలో చేరడానికి అల్లోల అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. మంచిర్యాలలో జనక్‌ప్రసాద్, బోడ జనార్దన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆసిఫాబాద్‌కు కొమరం భీమ్ మునిమనుమడు సోనేరావు పేరును ప్రచారంలోకి తీసుకవచ్చారు. అల్లోల చేరికతో కోట్నాక రమేష్‌కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
According to a Telugu daily- internal bickerings are at peak level in YS Jagan's YSR Congress party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more