లెక్కలు తేల్చండి, మెట్రోపై విభజన ఎఫెక్ట్!
తెలంగాణకు అనుకూలంగా యూపిఏ, సిడబ్ల్యూసి తీర్మానం చేసిన నేపథ్యంలో కేంద్రం విభజన వైపు వడివడిగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విభజనకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టాయి. సాగునీటి ప్రాజెక్టులు, ఒంగోలులో ప్రభుత్వ భూముల వివరాలపై రాష్ట్రం దృష్టి సారించగా... రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కీలక సమాచారాన్ని పంపించాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయం, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి-సరఫరా, ప్రభుత్వ పథకాల వంటి వివరాలను సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారీగా పంపించాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి లేఖ అందింది. ప్రాంతాలు, జోన్ల వారీగా ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? వచ్చే పదేళ్ళలో ఎంతమంది రిటైర్ అవుతారు? రాష్ట్ర కేడర్ పోస్టులు ఎన్ని? వాటిలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి? ఇలాంటి వివరాలను పంపించాలని ఆదేశించారు. 610 అమలు వివరాలు కూడా కోరారు.

సాగునీటి వసతికి సంబంధించి ప్రాంతాల వారీగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వాటిలో పూర్తయినవి, నిర్మాణంలో ఉన్నవి, అసలు పనులే మొదలుపెట్టనివి, నిధుల కేటాయింపు తీరు వంటి వివరాలు పంపాలని కేంద్ర హోంశాఖ కోరింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయం ఎంత? అందులో హైదరాబాద్ వాటా ఎంత? ఏ ప్రాంతంలో ఎంతెంత ఖర్చు చేస్తున్నారు? ఆదాయానికి ముఖ్యమైన విభాగాలైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, భూ క్రయ విక్రయాలపై ఆదాయాన్ని ఇవ్వాలని తెలిపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం సంబంధిత శాఖల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను త్వరగా తనకు పంపించాల్సిందిగా ఆదేశించారు. విభజన ఇష్టం లేకున్నప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీనికి సంబంధించిన సమీక్షలు మొదలుపెట్టారు. మంగళవారం ఆయన రాష్ట్ర జలవనరులు, ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ప్రధాన నదులు, వాటి ఉప నదులతోపాటు భారీ, మధ్య, చిన్నతరహా నీటి వనరుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నికర జలాల లభ్యత, ప్రాంతాల వారీగా ప్రస్తుత నీటి వినియోగం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, వాటికి కావాల్సిన నీరు, అవసరమైన నిధులపై అధికారులతో చర్చించారు. కృష్ణా, గోదావరి జలాల కేటాయింపులన్నీ ప్రాజెక్టుల వారీగా పక్కాగా ఉన్నాయని అధికారులు కిరణ్‌కు స్పష్టం చేశారు.
విభజన తర్వాత కృష్ణా నదిపైనున్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల డ్యామ్‌లు, బ్యారేజీల నిర్వహణపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. వీటి నిర్వహణ, నీటి కేటాయింపులు, నీటి విడుదల తదితర అంశాలపై నీటిపారుదల శాఖ, ప్రణాళిక శాఖ నివేదికలు తయారు చేస్తున్నాయి. అంతర్రాష్ట్ర డ్యాంల నిర్వహణ, నీటి విడుదలపై ఇప్పటివరకు జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధి విధానాలు, తుంగభద్ర, కావేరి వంటి నదీ జలాల విషయంలో అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలిస్తున్నాయి.
మరోవైపు విభజన నిర్ణయం హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు పైన ప్రభావం పడే అవకాశాలున్నాయంటున్నారు. హైదరాబాద్ మెట్రో 'యూనిక్ మోడల్' ప్లాన్‌లో యాభై ఐదు శాతం రెవెన్యూ ప్రయాణీకుల నుండి, మిగతా 45 శాతం ప్రాపర్టీ డెవలప్‌మెంట్, పార్కింగ్ చార్జెస్, అడ్వర్టెయిజ్‌మెంట్ వంటి కమర్షియల్ యాక్టివిటీస్ నుండి పొందవచ్చునని డిజైన్ చేసింది. అయితే విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో రాజధాని ఏర్పడితే మెట్రో పైన ప్రభావం పడవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications