కిరణ్‌కు 23నుండి 'భారీ' షాక్: బాబు, జగన్ వైపు?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీపై ఓ వైపు సస్పెన్స్ కొనసాగుతుండగా.. మరోవైపు కొందరు సీమాంధ్ర ప్రాంత నాయకులు ఆయనకు షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఓ వైపు కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజన వైపు వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ కిరణ్ కొత్త పార్టీపై తేల్చక పోవడం వారిలో ఆందోళన కలిగిస్తోందంటున్నారు. దీంతో ఇన్నాళ్లు కిరణ్ కొత్త పార్టీపై ఆశలు పెట్టుకున్న పలువురు నాయకులు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వైపు చూస్తున్నారట.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్, మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి తదితరులు కాంగ్రెసు పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారట. కిరణ్ కొత్త పార్టీ కోసం ఎదురు చూస్తున్న ఇలాంటి నేతలు టిడిపి, జగన్ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట.

కోస్తాంధ్ర ప్రాంతం నుండి మంత్రులు గంటా శ్రీనివాస రావు, తోట నర్సింహంలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బిల్లు పైన అభిప్రాయం చెప్పేందుకు రాష్ట్రపతి జనవరి 23వ తేదీ వరకు సమయం ఇచ్చారు. దీంతో జనవరి 23 నుండి టిడిపి, జగన్ పార్టీలలోకి చేరికలు ఊపందుకుంటాయంటున్నారు. ఇటీవల టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ అంతర్గత సమావేశాల్లో పలువురు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన విషయం తెలిసిందే.
కాంగ్రెసు పార్టీ నేతలకు గాలం
వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కాంగ్రెసు పార్టీ అధిష్టాంపై అసంతృప్తితో ఉన్న పలువురు నాయకులకు గాలం వేస్తున్నారట. పలు జిల్లాల్లో నాయకులు టిడిపి, జగన్ పార్టీ నాయకులతో చేరికలపై చర్చలు జరుపుతున్నారట. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో ఆ పార్టీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు అవసరమైతే తాము పార్టీని వీడేందుకు సిద్ధమని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జనవరి 23వ తర్వాత చేరికలు ఉంటాయంటున్నారు.












Click it and Unblock the Notifications