కెసిఆర్ బస్సుకు పూజలు: బాబుకూ బుల్లెట్ ప్రూఫ్ బస్సు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కోసం అన్నిహంగులతో కూడిన అత్యధునాతన బస్సు హైదరాబాదుకు చేరుకుంది. దానికి పూజలు కూడా జరిగాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కోసం చండీగఢ్‌లో అత్యధునాతన బుల్లెట్ ప్రూఫ్ బస్సు తయారవుతోంది.
హరితహారం కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పర్యటనకు వాడే బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిగాయి. చండీగఢ్‌లో రూపొందించిన ఈ బస్సు పూజలు జరిగిన తర్వాత రంగారెడ్డి జిల్లా చిలుకూరుకు బయలుదేరింది.

అత్యధునాతన హంగులతో చంద్రబాబు కోసం బస్సు తయారవుతోంది. రాష్ట్రంలోని జిల్లాల పర్యటనకు, అతిథిగృహంతో సంబంధం లేకుండా వాహనంలోనే బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను బస్సులో చేస్తున్నారు. భద్రతకు పూర్తి గ్యారంటీ ఉండే విధంగా అద్దాలతో సహా అంతా బుల్లెట్ల నుంచి రక్షణ కల్పించే విధంగా దాన్ని రూపొందిస్తున్నారు.
టైర్లను తూటాలతో పేల్చినా కూడా 30 - 50 కిలోమీటర్ల వరకు బస్సు సాఫీగా ప్రయాణిస్తుంది. బస్సును పరిశీలించేందుకు ఆర్టీసి ఎండి సాంబశివ రావు ఈ నెల 8,9 తేదీల్లో చండీగఢ్ వెళ్తున్నట్లు సమాచారం. జెసిబీఎల్ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్‌తో కలిసి ఈ బస్సును తయారు చేస్తోంది. రెండు మూడు వారాల్లో బస్సు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది.
బస్సులో కార్యాలయం ఏర్పాటు కూడా ఉంటుంది. ఆరుగురు ఏడుగురు కూర్చునే విధంగా సీటింగ్ ఆరేంజ్‌మెంట్ ఉంటుంది. దాని వెనక సిఎం కోసం ప్రత్యేక గది ఉంటుంది. 15, 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకునేందుకు రివాల్వింగ్ చైర్, రాత్రి వేళ నిద్రపోవడానికి పరువు ఉంటాయి. బస్సు వెనక భాగంలో స్నానాల గది ఉంటుంది. టీవీ, ఫ్యాక్స్, ఇంటర్నెట్, వైఫై, ప్రింటర్ సదుపాయాలు కూడా ఉంటాయి.












Click it and Unblock the Notifications