గుట్టురట్టు చేస్తున్న ఇండియన్ ఆర్మీ: యుద్ధానికి సై అన్న పాక్!
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ యూరి ఆర్మీ స్థావరం పైన ఉగ్రవాదుల దాడిలో పాకిస్తాన్ ప్రమేయం పైన ఆధారాలను సైన్యం బయటపెడుతోంది. దాడికి సంబంధించిన ఆపరేషన్ పూర్తయిందని, గాలింపు పూర్తి చేశామని, దాడి పైన డిజిఎంవో లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ మరిన్ని ఆధారాలు వెల్లడించారు.
ఉగ్రవాదుల నుంచి రెండు రేడియో సెట్లు, రెండు జిపిఎస్ సెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సాధారణంగా ఉగ్రవాదులు ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళ్లేటప్పుడు గ్రెనేడ్స్ పాయింట్లుగా వాడే మ్యాప్ షీట్లు, మెట్రిక్ షీట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నాలుగు ఏకే 47, నాలుగు గ్రెనెడ్ లాంఛర్లు, 39 అండర్ బ్యారెల్ గ్రెనెడ్ లాంఛర్ గ్రెనేడ్లు, ఐదు హ్యాండ్ గ్రెనేడ్లు, ఐదు హ్యాండ్ గ్రెనెడ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాక్ తయారీ మందులు, ఆహార పొట్లాలు కూడా ఉగ్రవాదుల వద్ద లభ్యమయ్యాయని రణబీర్ చెప్పారు.
గడిచిన మూడు నాలుగేళ్లలో ఈ ఏడాది చొరబాట్లు పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి దాకా 17 చొరబాటు యత్నాలు జరిగాయన్నారు. 31 మందిని చొరబాట్లు హతమార్చినట్లు చెప్పారు. భారత్ లక్ష్యంగా జరిగే దాడుల పైన ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి ప్రతి చర్యలకు దిగాలనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు తమకుంద్నారు. పాక్ పైన ప్రతిచర్య తప్పదన్నారు.
మరోవైపు, యూరిలో పాక్ ప్రేరిత ఉగ్రవాద దాడి దరిమిలా త్రివిధ దళాలు ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని భారత ప్రభుత్వం తమ బలగాలను ఆదేశించిన నేపథ్యంలో ఎలాంటి దాడిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ఆర్మీచీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ పేర్కొన్నారు.
సోమవారం రావల్పిండిలో టాప్ కమాండర్లతో భేటీ అయ్యాడు. పాకిస్తాన్ బలగాల యుద్ధ సన్నద్ధతపైన, సరిహద్దుల అంతర్గత భద్రతపైన సమీక్ష నిర్వహించాడు. యూరి ఉగ్రవాద దాడికి సంబంధించి పాక్‌పై భారత వ్యతిరేక కథనాలు ప్రచారం చేస్తోందని, ఈ నేపథ్యంలో దేశ భద్రత పరిస్థితులపై మిలిటరీ పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.
పరిణామాలను, పాక్ భద్రతపై దాని ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నామని, ప్రత్యక్ష, పరోక్ష ముప్పులను ఎదుర్కోవడానికి, పాక్ సార్వభూమాధికారానికి వ్యతిరేకంగా ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ సాయుధ బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ అన్నట్లుగా తెలుస్తోంది. యుద్ధ సన్నద్ధతపై ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది.
కాగా, కాశ్మీరులో తన భయానక పాలనను కప్పిపుచ్చుకోవడానికి భారత ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వ, మిలిటరీ అధికారులు రెచ్చగొట్టే ఆరోపణలు చేస్తున్నారని పాక్ విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నాడు.
పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, ప్రపంచంలో ఏకాకిని చేయాలన్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనను ఖండించారు. ఉగ్రవాద దాడిపై సముచిత దర్యాప్తు చేయకుండానే తమ దేశం పైన నిందలేస్తున్నారన్నారు.
ఇంకోవైపు, ఉగ్రవాదుల దాడిని మాటమాత్రానికైనా ఖండించని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీరు విషయంలో భారతపై తన విషప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఉపఖండంలో ఉద్రిక్తతలు, అస్థిరతకు కాశ్మీరు సమస్యే ప్రధాన కారణమని ఇది ప్రపంచ శాంతికి, భద్రతకు కూడా ముప్పుగా పరిణమించిందని భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ దేశాల అధిపతులకు సోమవారం లేఖ రాశాడు.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల్లో షరీఫ్ 21న ప్రసంగించనున్నారు. అందులోనూ కాశ్మీరును ప్రస్తావిస్తామని గతంలోనే స్పష్టం చేశారు. భద్రతామండలి అపరిష్కృత అంతర్జాతీయ సమస్యల్లో కాశ్మీరు చాలా పాతదని, శాశ్వత సభ్య దేశాలు దీనిని పరిష్కరించే బాధ్యత వహించాలని లేఖల్లో కోరారు.












Click it and Unblock the Notifications