జగన్‌కు గట్టి షాక్: పొంగులేటి కోసం హరీష్ రావు చక్రం
ఖమ్మం/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి గాలం వేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పొంగులేటితో పాటు ఖమ్మంలో మిగిలి ఉన్న వైసిపి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను కూడా చేర్చుకునే యత్నం చేస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో వైసిపి తరఫున ఖమ్మంలో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఇద్దరు ఇప్పటికే కారు ఎక్కారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైసిపిలోనే ఉన్నారు. అదే సమయంలో ఖమ్మం ఎంపిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరగా, పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ పొంగులేటి మాత్రం వైసిపిలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో వారికి కూడా టిడిపి గాలం వేస్తోంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా తెరాసలో చేరితే.. మిగతా ఎమ్మెల్యేలతో కలిసి విలీనం లేఖ ఇప్పించుకోవచ్చని అధికార పార్టీ భావిస్తోంది.

ఇప్పటికే ఎమ్మెల్యే వెంకటేశ్వర్లుతో తెరాస మంతనాలు జరుపుతోందని తెలుస్తోంది. ఆయనను చేర్పించుకునే దిశలో అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ఆయన చేరికకు మరిన్ని రోజులు సమయం తీసుకునే అవకాశముందని అంటున్నారు.
అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకునేందుకు మంత్రి హరీష్ రావు పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఆయనతో పలువురు తెరాస నేతలు టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. హరీష్ రావు, ఇతర తెరాస నేతలు తనను ఆహ్వానించారని, కానీ తాను వైసిపిలోనే ఉంటానని పొంగులేటి వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. మరోవైపు, టిడిపి, వైసిపి నేతలు కారు ఎక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటికి తెరాసలో చేరడం మినహా మరో దారి లేదని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయన వస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications