వారితో పోలిక: నారా లోకేష్‌కు అంత సత్తా లేదా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ ప్రమోషన్‌లో జాప్యం జరుగుతోంది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలతో పోల్చి చూడడం ఆయన మైనస్‌గా మారినట్లు కనిపిస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కెసిఆర్ తర్వాత ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు కెటి రామారావు పేరు వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడి, ప్రతిపక్ష నాయకుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఉండేవారు. భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతారనేది నిర్వివాదాంశం.
కెటిఆర్, జగన్ లాగా స్వతంత్రంగా ఎదగడంలో, సత్తా చాటడంలో, వచ్చిన అవకాశాలను సమర్థంగా ఉపయోగించకోవడంలో నారా లోకేష్ విఫలమవుతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. నారా లోకేష్‌ను మంత్రిగా తీసుకోవాలనే డిమాండ్ మాత్రమే మంత్రుల నుంచి, టిడిపి నాయకుల నుంచి వస్తోంది తప్ప భవిష్యత్తు ముఖ్యమంత్రి ఆయనే అనే మాట వారి నుంచి రావడం లేదు.

తనకంటూ స్వతంత్రమైన కార్యకర్తల సమూహం లేకపోవడం, వ్యాపార వర్గాల కోటరీ లేకపోవడం నారా లోకేష్‌కు మైనస్ పాయింట్లు అవుతున్నట్లు భావిస్తున్నారు. చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ ముందుకు వచ్చిన మాట నిజమే. కానీ, చంద్రబాబు ఆయనకు మార్గం ఏర్పాటు చేసి పెట్టారు. నారా లోకేష్ సొంతంగా ప్రజల్లో గానీ, ఇతర వర్గాల్లో గానీ తన సామర్థ్యాన్ని ప్రదర్శించుకోవడం ద్వారా ముందుకు రాలేదు.
కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారాని, ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, దీంతో ముఖ్యమంత్రి పదవి ఖాళీ అవుతుందనే మాట వినిపిస్తోంది. ఒక వేళ ముఖ్యమంత్రి పదవిని కెసిఆర్ ఖాళీ చేస్తే తర్వాత ఎవరనే ప్రశ్నకు కెటిఆర్ అనే సమాధానం వస్తోంది.
జిహెచ్ఎంసి ఎన్నికల బాధ్యతలనే కాకుండా వివిధ ఎన్నికల, ఉప ఎన్నికల బాధ్యతలను కెటిఆర్ మీద వేసుకుని పార్టీని విజయం దిశగా నడిపించారు. జిహెచ్ఎంసి ఎన్నికలు కెటిఆర్‌ను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. అదే జిహెచ్ఎంసి ఎన్నికలు నారా లోకేష్ నాయకత్వ ప్రతిభను ప్రశ్నార్థకం చేశాయి.
2019 ఎన్నికల్లో పార్టీని కెటిఆర్ ముందుండి నడిపించగలడనే విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. ఈ విషయంలో ఆయన తన బావ హరీష్ రావును కూడా దాటేసి వెళ్లాడు. తద్వారా పార్టీలో ఉన్న పోటీని తన ప్రతిభ ద్వారా అధిగమించాడు. కెటిఆర్ కార్పోరేట్ దిగ్గజాలతో, విదేశీ ప్రతినిధులతో, తన మంత్రివర్గ సహచరులతో వ్యవహారాలు నడుపుతూ సమర్థుడైన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు.
వైయస్ జగన్ విషయంలో మరో మాట లేదు. కాంగ్రెసు పార్టీని నాయకత్వాన్ని ధిక్కరించి, సొంత పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకు నడిపిస్తున్నాడు. పలు ఆటంకాలను ఎదుర్కుంటూ కూడా ఆయన పార్టీని నడిపిస్తున్నారు. నారా లోకేష్‌ను మంత్రులు, టిడిపి నాయకులు ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నా అంతగా ఫలితం ఉండడం లేదు.
పైగా, మంత్రిగానే కాకుండా కనీసం ప్రజాప్రతినిధిగా కూడా నారా లోకేష్‌కు అనుభవం లేదు. కెటిఆర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా శాసనసభ్యుడిగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. కడపలో వైయస్ జగన్ తిరుగులేని నాయకుడిగా ముందుకు వచ్చారు. మొత్తం మీద, నారా లోకేష్ భవిష్యత్తు అంత సాఫీగా లేనట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications