జగన్ ఎంట్రీ ప్లాన్: దుమ్ముగూడెంపై ఆందోళన
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినట్లు అర్థమవుతోంది. రాజీవ్ సాగర్ - దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను ఉధృతం చేయడం ద్వారా తెలంగాణలో తన ఉనికిని చాటుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
దుమ్ముగూడెం ప్రాజెక్టు అంశాన్ని రాష్ట్రస్థాయి సమస్యగా మార్చే క్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందుకు సాగుతోంది. డిజైన్ మార్చి దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది. దుమ్ముగూడెం ప్రాజెక్టును చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు పి. శ్రీనివాస రెడ్డి కెసిఆర్ ప్రభుత్వాన్ని కోరారు.
డిజైన్ మార్చి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, వైరా ప్రాంతాలకు నీరు మళ్లించే విధంగా ప్రాజెక్టును చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతుగా సిపిఎం కూడా రంగంలోకి దిగాలని అనుకుంటోంది. పార్టీ ప్రతినిధి బృందం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించింది. ఖమ్మం జిల్లా మెట్ట ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలని సిపిఎం నేత మల్లా రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు నీటి మళ్లించడాన్ని మానుకుని, ఖమ్మం జిల్లాలో మెట్ట ప్రాంతాలకు నీరు అందించేలా ప్రాజెక్టును నిర్మించాలని, ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని ఆయన అన్నారు.
సిపిఐ కూడా ప్రాజెక్టుకు అనుకూలంగా ఉంది. ఈ విషయంపై ఇటీవల సిపిఐ సమావేశమైంది. ప్రభుత్వం 9,300 కోట్ల రూపాయలతో చేపట్టిందని, దీనిపై 1,600 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. ప్రస్తుత డిజైన్ ప్రకారం వర్షాకాలం ఈ ప్రాజెక్టు నుంచి అశ్వారావుపేట ప్రాంతానికి 80 టిఎంసిల నీరు సరఫరా చేసి, మిగతా నీటిని నాగార్జునసాగర్‌కు మళ్లిస్తారు. నాగార్జున సాగర్‌కు నీటిని మళ్లించకుండా మొత్తం నీటిని ఖమ్మం జిల్లాకే ఇవ్వాలని తెలంగాణలోని సిపిఐ, సిపిఎం, వైయస్సార్ కాంగ్రెసు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications