ఏపీలో ఉద్యోగుల జీతాలపై గుడ్ న్యూస్- ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు..!

ఏపీలో ఉద్యోగుల జీతాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం (AP Govt) గుడ్ న్యూస్ చెప్పింది. పలు చోట్ల ఉద్యోగులకు సకాలంలో ఒకటో తేదీన జీతాలు జమ కావడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్థికశాఖ ఇతర అన్ని శాఖలకూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తమకు సహకరించాలని ప్రభుత్వ విభాగాలను ఆర్థికశాఖ ఆదేశాలిచ్చింది.

Advertisement
మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారానికి చెక్ - మరోసారి తేల్చిచెప్పిన ఏపీ సర్కార్..!
Advertisement

రాష్ట్రంలో అన్ని కార్యాలయాలు జీతాల బిల్లులను వెంటనే IFMS వెబ్ సైట్ లో అప్‌డేట్ చేయాలని ఆర్థికశాఖ ఆదేశించింది. జీతాల బిల్లులు సమయానికి అప్‌డేట్ చేయకపోతే సంబంధిత డీడీవోపై చర్యలు తీసుకోవాలని శాఖాధిపతులకు సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3,900 మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు IFMSలో అప్‌డేట్ కాలేదని గుర్తించారు. వీరిలో సుమారు 1,900 మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని తేలింది. ఆధార్ అప్‌డేట్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు సచివాలయంలోని ఆర్థికశాఖను సంప్రదించాలని కోరుతోంది.

గీత దాటితే వేటే.. ! వాళ్లకు టీడీపీ ఫైనల్ వార్నింగ్..!
Advertisement

గతంలో డిప్యుటేషన్‌లో పనిచేసి బదిలీపై కొత్తచోట చేరిన ఉద్యోగులకు కూడా ఆధార్ అప్‌డేట్ సమస్యలు ఎదురవుతున్నట్లు గుర్తించారు. అలాగే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సేవా కాలాన్ని కూడా ఈ నెల కూడా పొడిగించినట్లు ఆర్థికశాఖ తెలిపింది. కాబట్టి అన్ని శాఖలు వారి జీతాల బిల్లులను వెంటనే పంపించాలని మరోసారి కోరింది. కేంద్ర ప్రాయోజిత పథకాలలో పనిచేస్తున్న దాదాపు లక్ష మంది ఉద్యోగుల జీతాలకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి విడుదల చేయించుకునే బాధ్యత శాఖాధిపతులదే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌ను రాష్ట్ర నోడల్ అధికారిగా నియమించింది. జీతాల బిల్లులు పెండింగ్‌లో ఉంటే ముందే ఆర్థికశాఖకు తెలియజేయాలని శాఖాధిపతులను ఆదేశించారు. జూలై 30లోపు ఏ ఉద్యోగి జీతాల బిల్లు పంపకపోతే దానికి పూర్తి బాధ్యత సంబంధిత డీడీవోదే అని ఆర్థికశాఖ హెచ్చరించింది. దీంతో అనేక మంది డీడీవోలు ఇప్పటికే సచివాలయానికి వెళ్లి సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.