సాయికృష్ణ లాకప్ డెత్ చేయలేదు, చంపేస్తారు..! సీఐ నాగరాజు సంచలనం..!

విజయవాడలో సంచలనం రేపుతున్న సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో లాకప్ డెత్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండై జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీఐ నాగరాజు (CI Nagaraju) ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన్ను ఇవాళ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా లాకప్ డెత్ తో తనకు సంబంధం లేదంటూ నాగరాజు చెప్పిన మాటలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Advertisement

సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో తనకు సంబంధం లేదని, అలాగే తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు సీఐ నాగరాజు తెలిపారు. దీంతో ఆయన్ను లిఖితపూర్వకంగా ఇదే విషయం సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా తనను బలవంతం చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అకారణంగా తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని నాగరాజు తెలిపారు. దీంతో ఈ కేసులో నాగరాజు వెనుక పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో సిట్ విచారణకు పూర్తిగా సహకరించానని, తన దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని అందించానని నాగరాజు న్యాయమూర్తికి తెలిపారు.

Advertisement

మరోవైపు రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో నాగరాజు పనిచేసిన కృష్ణలంక పోలీసు స్టేషన్లలోనే పనిచేసి, ఈ హత్యతో సంబంధం ఉన్న హెడ్‌ కానిస్టేబుళ్లు అశోక్, నానిని పోలీసులు తాజాగా అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. వారి రిమాండ్ రిపోర్ట్ లో
అశోక్, నాని నిజాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు అధికారి ప్రశ్నలకు వారు మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు.
అలాగే ఫోన్లు అడిగితే నాగ్‌పూర్‌లో విక్రయించినట్టు చెప్పారని తెలిపారు. దీంతో వీరిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.