"సాయికృష్ణ శవాన్ని చూశా".. బయటపడ్డ సీఐ నాగరాజు బండారం!
విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన 'గాదె సాయికృష్ణ అదృశ్యం' మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అదృశ్యం కాదది.. ఖాకీల అండతో జరిగిన ఘోర లాకప్ డెత్ అని తేలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజును ప్రత్యేక విచారణ బృందం (సిట్) అధికారులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు హాల్‌లో ప్రభుత్వ న్యాయవాది వినిపించిన వాదనలు, జడ్జ్ అడిగిన ప్రశ్నలు, సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్టులోని అంశాలు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సీఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం సెక్షన్ల కింద కేసు నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అజిత్‌సింగ్‌నగర్‌లోని ఆయన స్నేహితుడి ఇంటి నుంచి నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కమాండ్ కంట్రోల్ కేంద్రానికి తరలించి.. సిట్ ఇన్‌ఛార్జి ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలోని బృందం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఐదు గంటలపాటు ముమ్మరంగా ప్రశ్నించింది. అయితే, ఉన్నతాధికారుల అంతర్గత ఆదేశాల మేరకో ఏమో కానీ.. నాగరాజు ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పకుండా నోరు మెదపలేదు. "నాకేం తెలీదు" అని జవాబిచ్చి దాటవేయడంతో, అధికారులు రాత్రి 10.30 గంటల తర్వాత మరోసారి విచారణ జరపాల్సి వచ్చింది.

బుధవారం ఉదయం సీఐ నాగరాజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, సిట్ అధికారులు విజయవాడలోని సెకండ్ ఏజేఎం (2nd AJM) కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరిస్తూ.. "గతనెల 8న సాయికృష్ణను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ అతడిని కోర్టులో హాజరుపరచకుండా విజయవాడ తీసుకొచ్చారు. స్టేషన్‌లో అప్పగించినట్లు స్పష్టమైన సాక్ష్యాలు, ఎకనాలజిమెంట్ కూడా ఉన్నాయి. కోర్టులో ప్రవేశపెట్టకపోవడం కచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. ఇది ముమ్మాటికీ కస్టోడియల్ (లాకప్) డెత్. సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపి, ఆధారాలు దొరకకుండా డెడ్ బాడీని డిస్ట్రాయ్ చేసి మాయం చేశారు" అని వాదించారు. సాయికృష్ణ తల్లి ఇప్పటికే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశారని గుర్తుచేశారు.
ఎస్సై వాంగ్మూలంతో గుట్టురట్టు.. జైలుకు నిందితుడు
విచారణలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సాయికృష్ణ బాడీని మాయం చేసినట్లు ఏ ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది సమాధానమిస్తూ, స్టేషన్లో జరిగిన ఘోరాన్ని దాచడానికే సీసీ ఫుటేజ్‌ను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేసి మాయం చేశారని తెలిపారు. అంతేకాదు, సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అత్యంత షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సాయికృష్ణను తీసుకెళ్లి మాయం చేశారని, ఈ కేసులో ఇప్పటివరకు 17 మంది సాక్షులను విచారించామని సిట్ పేర్కొంది. అన్నింటికంటే ముఖ్యంగా.. "సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ (పీఎస్) లోనే చూశాను" అని స్వయంగా సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో సీఐ నాగరాజు మెడకు గట్టిగా చుట్టుకుంది.
రిమాండ్ రిపోర్టులోని కీలక ప్రశ్నలు:
- మార్కాపురం నుంచి తీసుకొచ్చిన సాయికృష్ణను కోర్టులో హాజరుపరచకుండా ఏం చేశారు?
- స్టేషన్‌లోని సీసీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశారు?
- లాకప్‌లో కొట్టడం వల్లే చనిపోతే, ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎందుకు దాచిపెట్టారు? మృతదేహం ఏమైంది?
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. నిందితుడు సీఐ నాగరాజుకు జులై 8వ తేదీ వరకు (14 రోజుల పాటు) జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయనను నెల్లూరు జైలుకు తరలించనున్నారు. ఒక పోలీస్ అధికారి స్టేషన్లోనే నిందితుడి ప్రాణాలు తీసి, శవాన్ని, సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించడం పోలీస్ శాఖలోనే అత్యంత నల్లటి మచ్చగా నిలిచింది.













Click it and Unblock the Notifications