నిమిషానికి 28 సార్లు మెరుపులు.. ఏడాదికి 300 రోజులు ఉరుములు..
ప్రపంచంలో ఎక్కడైనా తుఫాను వచ్చిందంటే గంటో రెండు గంటలో ఉరుములు, మెరుపులతో వాన పడి వెళ్ళిపోతుంది. కానీ ఈ చిత్రమైన ప్రాంతంలో మాత్రం రాత్రి కాగానే ఆకాశంలో విరబూసే మెరుపులు గంటల తరబడి ఆగిపోవు. సంవత్సరంలో దాదాపు 300 రోజులు ఇక్కడ నాన్‌స్టాప్‌గా మెరుపుల వెలుగులు విరజిమ్ముతుంటాయి. దట్టమైన చీకటిలో నిమిషానికి సగటున 28 సార్లు ఉరుములు లేని మెరుపులు ఆకాశాన్ని చీల్చుకుంటూ వస్తుంటే.. కొండల మధ్య అదొక అద్భుతమైన కాంతి పండుగలా కనిపిస్తుంది. దక్షిణ అమెరికా ఖండంలోని వెనిజులా దేశంలో ఉన్న 'మరాకైబో' సరస్సు తీరం వద్ద జరిగే ఈ సహజసిద్ధ విచిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను, పర్యాటకులను అశ్చర్యంలో ముంచెత్తుతోంది.
మెరుపుల రాజధాని వెనుక దాగున్న రహస్యం!
ఈ ప్రాంతంలో కటాటుంబో నది వచ్చి మరాకైబో సరస్సులో కలుస్తుంది. అందుకే ఈ వింతను స్థానికులు 'కటాటుంబో లైట్నింగ్' అని పిలుచుకుంటారు. ప్రతిరోజూ సంధ్యా సమయం దాటగానే ఇక్కడ ప్రారంభమయ్యే ఈ వెలుగుల ప్రక్రియ రాత్రి వేళ సుమారు 9 గంటల పాటు నిరంతరాయంగా సాగుతుంది. అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఉపగ్రహాలు పంపిన నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధికంగా మెరుపులు పడే ప్రదేశంగా ఈ ప్రాంతం రికార్డులకెక్కింది. ఇక్కడ చదరపు కిలోమీటరు పరిధిలో ఏడాదికి సగటున 232 సార్లు మెరుపులు కొడతాయంటే ఆశ్చర్యం కలగక మానదు.

కొండలు.. గాలులు చేసిన విచిత్ర మిశ్రమం!
ఇంత భారీ స్థాయిలో మెరుపులు పడటానికి ఈ సరస్సు చుట్టూ ఉన్న ప్రత్యేక భౌగోళిక పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సరస్సుకు మూడు వైపులా ఎత్తైన పర్వత శ్రేణులు, ఒకవైపు కరేబియన్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. పగటిపూట సూర్యరశ్మికి సరస్సు నీరు వేడెక్కి ఆవిరవుతుంది. రాత్రి కాగానే కరేబియన్ సముద్రం నుంచి వీచే చల్లని గాలులు ఈ వేడి, తేమతో కూడిన గాలిని కొండల వైపు నెడతాయి. ఆ వేడి గాలి పైకి లేచి ఆకాశంలో దట్టమైన మబ్బులుగా మారినప్పుడు.. లోపల మంచు స్పటికాలు, నీటి బిందువులు ఒకదానికొకటి వేగంగా ఢీకొని భారీ విద్యుత్ శక్తి ఉత్పత్తవుతుంది. అదే ఆకాశంలో ఈ రేంజ్ మెరుపులకు దారితీస్తోంది.
నావికులకు లైట్ హౌస్.. వ్యాపారాలకు ముప్పు!
వందల ఏళ్ల క్రితం సముద్రంలో ప్రయాణించే నావికులు ఈ వెలుగులను చూసే తమ ఓడల దారిని కనుక్కునేవారు. అందుకే దీన్ని 'మరాకైబో లైట్ హౌస్' అని కూడా పిలిచేవారు. ఇప్పటికీ ఇక్కడి సరస్సుపై ఆధారపడి జీవించే వేలాది మంది జాలర్లకు ఈ మెరుపులు నిత్యం ముప్పుగానే పరిణమిస్తున్నాయి. రాత్రి వేళ వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఆ ప్రాంతంలో ఉన్న చమురు, సహజ వాయువు ఉత్పత్తి కేంద్రాలకు, విద్యుత్ గ్రిడ్లకు కూడా ఈ మెరుపుల వల్ల నిత్యం అంతరాయం కలుగుతుంటుంది.
ముందే ఊహించే దిశగా శాస్త్రవేత్తల ప్రయోగాలు!
సాధారణంగా పిడుగులను ముందుగా ఊహించడం కష్టం. కానీ అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాల సమాచారం, గాలిలో ఉండే తేమ, ఉష్ణోగ్రతలను విశ్లేషించి కటాటుంబో ప్రాంతంలో ఏ రోజుల్లో మెరుపుల ఉధృతి తీవ్రంగా ఉంటుందో ముందే చెప్పే సీజనల్ సూచీలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇక్కడ మెరుపుల ప్రభావం గరిష్టంగా ఉంటుందని, జనవరి, ఫిబ్రవరి నాటికి కొంత తగ్గుతుందని గుర్తించారు. ముందస్తు సమాచారం ద్వారా జాలర్లను, స్థానిక పరిశ్రమలను ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఈ అంచనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.














Click it and Unblock the Notifications