ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులతో కూర వండిన మహిళ.. ఆ తర్వాత జరిగిందిదే!
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ను విపరీతంగా వినియోగిస్తున్న వారు పెరిగిపోయారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి వాటిని ఫాలో చేస్తున్న వారు కూడా లేకపోలేదు.అయితే రీల్స్ చూసి అందులో ఏం ఉందో అది చేయటం మంచిది కాదని చాలా సందర్భాలలో చాలామంది చెప్తున్నా, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వాళ్ళు లేకపోలేదు.
ఏపీలో దారుణం.. ప్రాణం మీదకు తెచ్చిన వంట
ఇక అటువంటి ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో సోషల్ మీడియా ప్రభావంతో జరిగిన ప్రమాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన ఒక వంట వీడియోను అనుసరించి, ఒక మహిళ ఉమ్మెత్త ఆకులతో కూర వండడం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. వారిని తీవ్ర అనారోగ్యానికి గురి చేసింది.

ఇన్‌స్టా రీల్స్ చూసి ఉమ్మెత్త ఆకుల కూర
కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని యెర్రంపాలెం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన కుటుంబ సభ్యులు ఒక దేవాలయ కార్యక్రమం కోసం అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన వీడియో ఆధారంగా ఉమ్మెత్త ఆకులతో పప్పు కలిపి కూర వండారు.
ఆస్పత్రి పాలైన కుటుంబం
ఆ కూర తిన్న కొద్ది గంటల్లోనే కుటుంబ సభ్యులకు వాంతులు, తల తిరుగుడు, మత్తు లక్షణాలు కనిపించాయి. పరిస్థితి విషమించడంతో వారిని ముందుగా పెదపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి మార్చి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తెలిపిన ప్రకారం ఉమ్మెత్త ఆకులు విషపూరితమైనవి కావడంతో ఈ సమస్యలు తలెత్తాయి.
సోషల్ మీడియాలో కనపడే ప్రతీది అనుసరించటం మంచిది కాదు
ఆ కూర తినని ఇతర కుటుంబ సభ్యులు మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చూసిన ప్రతి విషయాన్ని అజాగ్రత్తగా అనుసరించడం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. తెలియని మొక్కలు లేదా పదార్థాలతో వంటలు చేయడంలో జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మెత్త ఆకులతో కూర వండుకు తింటే చాలా బలం అని ఆ వీడియో లో చెప్పటంతో ఈ కుటుంబం ప్రయోగం చేసింది. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పతిలో చికిత్స పొందుతోంది.













Click it and Unblock the Notifications