ఈ ఏడాది బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను బరిలోకి దిగకుండా జన్ సురాజ్ పార్టీ తరఫున అభ్యర్దులను బరిలోకి దించి ఓటమిపాలైన జన్ సురాజ్ పార్టీ అధినేత, ఒకప్పటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor).. తాజాగా బంకీపూర్ సీటులో జరిగిన ఉపఎన్నికల్లో (Bankipur bypoll) మాత్రం పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇవాళ జరిగిన బంకీపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఆరంభం నుంచీ అధిక్యం కొనసాగించిన ప్రశాంత్ కిషోర్.. బీజేపీ అభ్యర్దిని చిత్తుగా ఓడించారు.
ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ జోరు- బీజేపీ కంచుకోట బద్దలవుతుందా ?
బంకీపూర్ సీటుకు జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ లో రౌండ్ రౌండ్ కూ ఆధిక్యం పెంచుకుంటూ పోయిన ప్రశాంత్ కిషోర్.. తాజా సమాచారం అందేసరికి 29 రౌండ్లు పూర్తయ్యే నాటికి దాదాపు 20 వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ 10 వేల ఓట్లు కూడా దాటలేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ గెలుపు ఖాయమైపోయింది. బీజేపీ సైతం ప్రశాంత్ కిషోర్ గెలుపును అంగీకరించింది. తాము ప్రజల తీర్పును గౌరవిస్తామని, బీజేపీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందని బీహార్ మంత్రి విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. ప్రతిపక్షాల మాదిరిగా ఎన్నికల కమిషన్‌ను, ఈవీఎంలను గానీ నిందించమన్నారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని, రాజ్యాంగబద్ధమైన సంస్థలను గౌరవిస్తామని, ప్రజల తీర్పును అంగీకరిస్తామని వెల్లడించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామాతో ఖాళీ అయిన బంకీపూర్ అసెంబ్లీ సీటుకు గత సోమవారం జరిగిన ఉపఎన్నికలో అనూహ్యంగా పోటీకి దిగిన ప్రశాంత్ కిషోర్ ను బీజేపీ అసలు లెక్కలోకి తీసుకోలేదు. బంకీపూర్ లో కుక్కను లేదా పిల్లిని పెట్టినా గెలుస్తుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వంటి వారు బీరాలు పలికారు. కానీ తాజాగా ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన నిరసనలకు కొనసాగింపుగా బీహార్ లోనూ యువత రోడ్లపైకి వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ కు కలిసొచ్చింది. బంకీపూర్ లో గెలుపుపై స్పందించిన ప్రశాంత్ కిషోర్.. మూడు దశాబ్దాల పాటు నిలిచిన ఆ కోట కేవలం 30 రోజుల్లోనే కూలిపోయిందన్నారు. కేవలం నాలుగు-ఐదు కిలోల ఉచిత రేషన్, కుల రాజకీయాలకు అతీతంగా తమ పిల్లల విద్య , ఉపాధి కోసం ప్రభుత్వాలు పనిచేయాలని బీహార్ ప్రజలు కోరుకుంటున్నందువల్లే అది పతనమైందన్నారు. తమ పోరాటం ఏ ఒక్క వ్యక్తికీ వ్యతిరేకం కాదన్నారు. బీజేపీకి మెజారిటీ ఉందని, ఎన్డీయే ప్రభుత్వం కొనసాగుతుందనని, తాము కేవలం ఒక విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నామన్నారు. బీహార్ ప్రజలు, ముఖ్యంగా బంకీపూర్ ప్రజలు ప్రధాని మోదీని ఒక అభ్యర్థన చేస్తున్నారన్నారు. అది బీహార్ ముఖ్యమంత్రిగా సమర్థుడైన, సద్గుణ సంపన్నుడైన వ్యక్తిని నియమించాలన్నారు. తద్వారా ప్రజలు తాము బీహారీయులమని గర్వపడేలా, అలాగే తమ పిల్లలకు నాణ్యమైన విద్య, ఉపాధి లభించేలా చూడాలన్నారు.నేను స్కాలర్ షిప్, లోన్ వివరాలిస్తా..! చక్రవర్తి తన డిగ్రీ బయటపెడతారా ?