ఇక తప్పట్లేదు- పాకిస్తాన్ ద్వారా ఇరాన్ మధ్యవర్తిత్వం
ఇరాన్ తో చర్చలు విఫలమైన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) వార్ మోడ్ లోకి వెళ్లింది. ఇరాన్ పోర్టులను దిగ్బంధించనుంది. ఇప్పటికే ఇది అమలులోకి వచ్చింది. ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాలు, అరేబియన్ గల్ఫ్, ఒమాన్ గల్ఫ్‌లోని సముద్ర మార్గాలను ఉపయోగించుకునే అన్ని దేశాల నౌకలపై దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా వెల్లడించింది.
యుద్ధాన్ని ముగించడానికి, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికాకు తాజా ప్రతిపాదనను పంపింది ఇరాన్. అణు చర్చలను తదుపరి దశకు వాయిదా వేయాలని కోరింది. ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు స్తంభించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అణు ఒప్పందంపై అమెరికాకుఎలాంటి హామీలు ఇవ్వాలనే దానిపై ఇరాన్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఈ ప్రతిపాదన అణు అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి, యుద్ధాన్ని ముగించడానికి ఓ పరిష్కార మార్గాన్ని కనగొనాలని భావిస్తోంది.

చర్చలు పునరుద్ధరించడానికి, అవి సానుకూల వాతావరణంలో సాగడానికి, ఫలప్రదం అయ్యేలా చేయడానికి ఇరాన్ తాజా ప్రతిపాదనలను సూచించింది. చర్చల అజెండాలో అణు అంశాన్ని పక్కన పెట్టి, మిగిలిన వాటిపై సానుకూలంగా చర్చించడానికి సమ్మతి తెలిపింది. అది కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం ద్వారానే సాధ్యం కావాలని మెలిక పెట్టింది. ఇస్లామాబాద్లోనే చర్చలు సాగాలని కోరుకుంటోంది ఇరాన్. దీనికంటే ముందు బ్లాకెడ్ తొలగించాలనే ప్రతిపాదన కూడా అమెరికా ముందు ఉంచింది.
బ్లాకెడ్ తొలగింపు అనే పాయింట్ వద్ద అమెరికా సుముఖంగా ఉండట్లేదు. ఇప్పటికిప్పుడు దీన్ని తొలగిస్తే ఇరాన్ పై పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను ప్రతిష్ఠంబింపజేయడంతో పాటు, దాని ఉత్పత్తిని నిలిపివేయడం ట్రంప్ యుద్ధ లక్ష్యం. ఈ నేపథ్యంలో అదే అణు ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి, ఇతర అంశాలపై చర్చించడానికి ఆయన ఎంత వరకు సానుకూలతను వ్యక్తం చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇదే అంశంపై నేడు ట్రంప్ పెంటగాన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సిచ్యుయేషన్ రూమ్ సమావేశం నిర్వహించనున్నారు. చర్చలలో నెలకొన్న స్తంభన, భవిష్యత్ చర్యలపై ఓ నిశ్చితాభిప్రాయానికి వస్తారని చెబుతున్నారు. ఆదివారం ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు కూడా. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకుంటున్న నావికా దిగ్బంధనాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్ త్వరలోనే లొంగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications