ఇరాన్ డ్రోన్ దాడుల్లో భారతీయులకు గాయాలు.. కేంద్రం రియాక్షన్ ఇదే !!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెర లేపాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఫుజైరాలో గల ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌లో ఉన్న చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడటం మరింత కలవరపరిచింది. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందుతున్నట్లు సమాచారం.
ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. అమాయక పౌరులు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా అంగీకారయోగ్యం కాదని ఖండించింది. ఇలాంటి దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ, పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని తెలిపింది.

ఈ మేరకు MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జయస్‌వాల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛాయుత నౌకాయానం కొనసాగడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యం, ముఖ్యంగా ఇంధన సరఫరాల పరంగా ఈ మార్గం కీలకమని ఆయన స్పష్టం చేశారు.
ఇదే విషయంపై నరేంద్ర మోదీ కూడా స్పందిస్తూ, యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. పౌరులపై దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని, హర్మూజ్ మార్గం సురక్షితంగా ఉండటం ప్రపంచ ఇంధన భద్రతకు కీలకమని పేర్కొన్నారు. యూఏఈ పై జరిగిన దాడుల నేపథ్యంలో, అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇరాన్‌ను శాంతి చర్చలకు రావాలని కోరాయి.
హర్మూజ్ జలసంధిని యుద్ధరంగంగా మార్చకుండా, ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేయొద్దని హెచ్చరించాయి. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తిరస్కరించింది. ఫుజైరాలోని ఆయిల్ ఫెసిలిటీని కావాలని లక్ష్యంగా చేసుకోలేదని, అమెరికా చేపట్టిన చర్యల వల్లే ఈ ఘటన జరిగిందని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. హర్మూజ్ ప్రాంతంలో అమెరికా సైనిక జోక్యం పరిస్థితులను మరింత క్లిష్టం చేస్తోందని ఆరోపించింది.
ఇదిలా ఉండగా, ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గం కావడంతో, ఇక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారితే చమురు ధరలు పెరగడం, వాణిజ్యానికి అంతరాయం కలగడం వంటి పరిణామాలు సంభవించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications