ట్రంప్ కు మొజ్తబా ఖమేనీ కీలక వార్నింగ్.. హార్మూజ్ జలసంధిపై..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య ఇటీవల జరిగిన తొలి రౌండ్ శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సవాల్ లు ప్రతి సవాల్ లు పెరిగాయి. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా ఆంక్షలు, దిగ్బంధనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే హార్మూజ్ జలసంధి నిర్వహణ విషయంలో కొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తామని తద్వారా శత్రు దేశాల వేధింపులు హార్మూజ్ జలసంధిపై అరికట్టి శాంతిని నెలకొల్పుతామని తెలిపారు. ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకునేంత వరకూ హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ నుంచి ఈ ప్రకటన రావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి వేడెక్కాయి.
పర్షియన్ గల్ఫ్, హార్మూజ్ జలసంధి విషయంలో త్వరలోనే కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటుందని మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమేనీ విడుదల చేసిన లిఖిత పూర్వక ప్రకటనను ఇరాన్ మీడియా చదివి వినిపించింది. పర్షియన్ గల్ఫ్ లో అమెరికా స్థానం సముద్ర జలాల అడుగున మాత్రమే ఉంటుందని ఖమేనీ ఎద్దేవా చేశారు. అంతకుముందు ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ ను హెచ్చరించింది. ఆ దేశాలను వణికించే ఆయుధం తమ వద్ద ఉందని పేర్కొంది. అమెరికాకు గుండెపోటు తెప్పించే ఆ ఆయుధాన్ని త్వరలోనే ప్రయోగిస్తామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు కూడా ఇరాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకునేంత వరకూ హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తామని ప్రకటించారు. దిగ్బంధనాన్ని ఎత్తి వేయాలనే ఇరాన్ ప్రతిపాదనపై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ట్రంప్. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతూందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా చర్చలకు ఇరాన్ సిద్ధం అవుతూందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇక ప్రపంచ వాణిజ్య సరఫరాలో హర్మూజ్ జలసంధి ఎంతో కీలకమైనది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ జలసంధి గుండానే వెళ్తుంది.












Click it and Unblock the Notifications