లాక్ డౌన్ లోకి దేశ రాజధాని.. ఖాళీగా రోడ్లు, షాపులన్నీ క్లోజ్, సొంతూళ్లకు ప్రజలు..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం ఆ దేశాలనే కాదు ప్రపంచ దేశాలను సైతం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఈ యుద్ధంతో పూర్తిగా దెబ్బతింది. అయితే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇటీవల ఇరాన్- అమెరికా బృందాల మధ్య తొలి దశ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. కానీ అవి ఫలించలేదు. దాదాపు 21 గంటలు జరిగిన చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. అయితే ఇరాన్- అమెరికా మధ్య ఇస్లామాబాద్ లో రెండో దశ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
అయితే ఇరాన్- అమెరికా శాంతి చర్చల కారణంగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో లాక్ డౌన్ విధించారు. దాదాపు 10 రోజులుగా అక్కడ లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాజధానిలో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. కొవిడ్ -19 లాక్ డౌన్ తరహా పరిస్థితి ఇస్లామాబాద్ లో కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. వేలమంది వర్కర్లను అద్దె ఇళ్ల నుంచి ఓనర్లు తొలగిస్తున్నారు. దీంతో వాళ్లంతా తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
ఇరాన్- అమెరికా బృందాల మధ్య జరిగే చర్చలను ఇస్లామాబాద్ టాక్స్ అని పిలుస్తున్నారు. తొలి దశ చర్చలు ఇప్పటికే ఫెయిల్ కాగా.. మరో రౌండ్ చర్చలు జరుగుతాయని అంతా భావిస్తున్నారు. దాంతో 10 రోజులుగా లాక్ డౌన్ పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది ఇస్లామాబాద్. ప్రజా రవాణా పూర్తిగా బంద్ అయింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వ్యాపారాలు పూర్తిగా మూసివేయడం వల్ల కూలీ పని చేసుకునేవారికి పని లేకుండా పోయింది. రోడ్లన్నీ ఇప్పుడు పోలీసులు, ఆర్మీ బలగాలతో నిండిపోయాయి.

ఇక పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వం.. ఇస్లామాబాద్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వస్తున్నారు.. ఇరాన్ అధ్యక్షుడు వస్తున్నారు.. అని చెబుతోంది. దాంతో ఆ దేశాధినేతలు వచ్చి చర్చలు జరిపి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని పాకిస్థాన్ స్థానికులు కూడా కోరుకుంటున్నారు. ఇదిలాఉంటే ఇరాన్- అమెరికా మధ్య రెండో రౌండ్ చర్చలు జరుగుతాయా..? లేదా..? అన్న స్పష్టత నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదే అంశంపై బుధవారం మాట్లాడుతూ మరో 72 గంటల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారని స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications