ఇస్రోను పేల్చేస్తామంటూ ఈమెయిల్.. అర్ధరాత్రి హైఅలర్ట్!
భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో'కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబుతో పేల్చివేస్తామంటూ ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే దేశీయ భద్రతా సంస్థలు, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇస్రో ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టడంతో పాటు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
అయితే ఇస్రోతో పాటు దేశంలోని కీలక ప్రభుత్వ సంస్థలకు ఇలాంటి బెదిరింపులు రావడం గత కొన్ని రోజుల్లో ఇది రెండోసారి. అంతకుముందు జూన్ 29న కూడా ఇస్రో సహా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వంటి అత్యంత కీలకమైన, హై-సెక్యూరిటీ జోన్లలో బాంబులు పెట్టామని.. భారీ పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. అప్పట్లో బాంబు స్క్వాడ్, పోలీసులు జరిపిన సోదాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపులన్నీ ఫేక్ అని తేలింది.

జూన్ 29న వచ్చిన నకిలీ బెదిరింపు ఈమెయిల్స్ కేసుకు సంబంధించి పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన 36 ఏళ్ల నిశాంత్ త్యాగి అనే వ్యక్తిని జూన్ 30న అతని నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిశాంత్ త్యాగి 2008 నుంచి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసింది. అతని కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నిందితుడి నుంచి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ప్రస్తుతం అతను ఈ మెయిల్స్ ఎందుకు పంపాడమే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
చంద్రయాన్, గగన్‌యాన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఇస్రో నిరంతరం బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు తాత్కాలికంగా కొంత కలకలాన్ని రేపినప్పటికీ.. అంతరిక్ష సంస్థ వద్ద భద్రత ఎల్లప్పుడూ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఇస్రో, ఇతర సున్నితమైన సంస్థల వద్ద సీఐఎస్ఎఫ్, లోకల్ పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాలు 24 గంటలూ నిఘా ఉంచుతాయి. అయితే డిజిటల్ యుగంలో ఈమెయిల్స్ ద్వారా ఇలాంటి ఫేక్ బెదిరింపులకు పాల్పడటం సులభంగా మారడంతో సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.












Click it and Unblock the Notifications