డేటింగ్ సబ్సిడీ: ప్రేమలో పడితే రూ.12 వేలు, ప్రభుత్వం వినూత్న నిర్ణయం
జపాన్‌లో ముదురుతున్న జనాభా సంక్షోభం ఆ దేశాన్ని వినూత్న నిర్ణయాల వైపు నడిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధాప్యం చెందుతున్న సమాజంగా మారుతున్న జపాన్, ఇప్పుడు తన యువతను ప్రేమలో పడేలా చేసేందుకు ఏకంగా 'ప్రభుత్వ సబ్సిడీ'ని ప్రకటించింది. 2024 గణాంకాల ప్రకారం, జపాన్ జనాభాలో 29.3 శాతం మంది (సుమారు 3.62 కోట్ల మంది) 65 ఏళ్ల పైబడిన వారే. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో జననాల రేటును పెంచేందుకు కొచ్చి ప్రిఫెక్చర్ (రాష్ట్రం) ఒక వింతైన, ఆసక్తికరమైన పథకాన్ని తెరపైకి తెచ్చింది.
ఒంటరిగా ఉంటున్న యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వాములను వెతుక్కునేందుకు అయ్యే ఖర్చును ఇకపై ప్రభుత్వం భరించనుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమైన ఈ పథకం కింద, 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు గల వారు డేటింగ్ యాప్‌లు లేదా మ్యాజ్ మేకింగ్ సేవలను ఉపయోగిస్తే, వారికి ఏడాదికి గరిష్టంగా 20,000 యెన్‌లు (సుమారు రూ.12,000) సబ్సిడీగా ఇస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజులు, మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్లు వంటి వాటికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. యువత పెళ్లి వైపు అడుగులు వేయడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈవెంట్లు నిర్వహిస్తే లక్ష రూపాయలు..
కేవలం వ్యక్తులకే కాకుండా, ఒంటరి నివాసితులు ఒకరినొకరు కలుసుకునేలా సామాజిక ఈవెంట్లు నిర్వహించే సంస్థలకు కూడా ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇలాంటి 'మీటింగ్ ఈవెంట్స్' నిర్వహించే సంస్థలకు గరిష్టంగా లక్ష యెన్‌లు (సుమారు రూ.58,795) గ్రాంట్‌గా అందజేస్తారు. "కొచ్చి ప్రిఫెక్చర్ ఆపర్చునిటీ ఫర్ మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్" కింద ఈ నిధులను విడుదల చేయనున్నారు. ప్రేమను వెతుక్కునే వారి కోరికలను నెరవేర్చి, దేశంలో వివాహాల సంఖ్యను పెంచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
రికార్డు స్థాయిలో తగ్గుతున్న జననాలు..
జపాన్ ఎందుకింతలా కష్టపడుతోందో అర్థం చేసుకోవాలంటే అక్కడి జననాల గణాంకాలను చూడాలి. 1899లో రికార్డులు ప్రారంభమైన నాటి నుండి 2025లో అతి తక్కువగా 7,05,809 జననాలు మాత్రమే నమోదయ్యాయి. వరుసగా పదో ఏడాది కూడా జననాల రేటు క్షీణించడం గమనార్హం. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక అస్థిరత మరియు మారుతున్న సామాజిక పోకడల వల్ల అక్కడి యువత పెళ్లికి, పిల్లలను కనడానికి దూరంగా ఉంటున్నారు.
మొత్తానికి, ఒకవైపు టెక్నాలజీలో దూసుకుపోతున్న జపాన్, మరోవైపు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి జనాభాను కాపాడుకోవడానికి ఇలాంటి 'డేటింగ్ సబ్సిడీ'ల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఈ వినూత్న ప్రయత్నాలు జపాన్ జనాభా సంక్షోభాన్ని ఎంతవరకు అరికడతాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications