15 రోజులకోసారి జీతం.. ప్రధాని సంచలన నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగి అంటే నెలాఖరు వరకు ఎదురుచూడాల్సిందే.. ఒకటో తేదీ వస్తేనే చేతిలో డబ్బులు ఆడేది! కానీ, ఇకపై ఆ సంప్రదాయానికి కాలం చెల్లింది. నేపాల్ ప్రధాని బాలెన్ షా ఒక సంచలన నిర్ణయంతో తన మార్క్ రాజకీయాలను చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు ఒకసారి కాకుండా, ప్రతి 15 రోజులకోసారి జీతం అందించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఇప్పుడు దక్షిణాసియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
నేపాల్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా ప్రధాని ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల చేతికి తరచుగా డబ్బులు అందడం వల్ల మార్కెట్‌లో కొనుగోళ్లు పెరుగుతాయని, తద్వారా నగదు చలామణి పెరిగి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 17న ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం మేరకు, తక్షణమే అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి.

చట్ట సవరణకు రంగం సిద్ధం..
నేపాల్ సివిల్ సర్వీస్ చట్టం ప్రకారం ప్రస్తుతం నెలకు ఒకసారి మాత్రమే జీతాలు ఇచ్చే వీలుంది. అయితే, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఈ అడ్డంకిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. పౌర సేవకులు, ఆర్మీ, పోలీసులు.. ఇలా అన్ని విభాగాల వారికి ఈ 15 రోజుల వేతన విధానం వర్తించనుంది. ఫైనాన్షియల్ కంప్ట్రోలర్ జనరల్ కార్యాలయం (FCGO) కూడా ఈ విధానాన్ని అమలు చేయడానికి సాంకేతికంగా తాము సిద్ధమని ప్రకటించింది.
ప్రపంచ దేశాల బాటలో నేపాల్..
అమెరికా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే రెండు వారాలకోసారి జీతాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఇప్పుడు నేపాల్ కూడా అదే బాట పట్టడం విశేషం. భారత్, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల్లో ఇంకా నెలవారీ జీతాల విధానమే కొనసాగుతున్న తరుణంలో, బాలెన్ షా తీసుకున్న ఈ నిర్ణయం ఒక విలక్షణమైన అడుగుగా నిలుస్తోంది.
మొత్తానికి, '15 రోజులకోసారి జీతం' అనే మంత్రం నేపాల్ ఉద్యోగుల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపుతుందో వేచి చూడాలి!












Click it and Unblock the Notifications