హార్ముజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు.. అమెరికాకు చైనా వార్నింగ్!
హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరోసారి శిఖరాగ్రానికి చేరుకున్నాయి. చైనా నుంచి వస్తున్న ఓ ఇరానియన్ కార్గో నౌకపై అమెరికా నౌకాదళం కాల్పులు జరిపి.. దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తూ.. ఇది కేవలం సాయుధ దోపిడీ అంటూ అభివర్ణించింది. అమెరికా చర్యకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని.. నేరుగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
చైనా ఆగ్రహం
ఈ పరిణామంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తీరును అక్రమ, ప్రమాదకరమైన చర్యగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ అభివర్ణించారు. ఇప్పటికే అత్యంత సున్నితంగా ఉన్న హార్ముజ్ జలసంధిలో ఇటువంటి ఉద్రిక్తతలు పెంచడం సరికాదని హితవు పలికారు. అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అమెరికాను చైనా హెచ్చరించింది. ఇరాన్‌తో తమకు ఉన్న బలమైన వాణిజ్య సంబంధాల నేపథ్యంలో ఈ నౌకను అడ్డుకోవడంపై చైనా గుర్రుగా ఉంది.

సమర్థించుకుంటోన్న అగ్రరాజ్యం
అమెరికా మాత్రం తన చర్యను సమర్థించుకుంటోంది. ఇరాన్ నౌకాశ్రయాలపై తాము విధించిన దిగ్బంధాన్ని ఉల్లంఘించేందుకు సదరు నౌక ప్రయత్నించిందని.. అందుకే కాల్పులు జరిపి దానిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని అమెరికా వెల్లడించింది. అయితే ఇరాన్ మాత్రం తాము కేవలం వాణిజ్య అవసరాల కోసమే నౌకను నడుపుతున్నామని.. అమెరికా కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది.
చమురు రవాణాకు అడ్డంకి
ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ప్రతిరోజూ కోట్ల కొద్దీ బ్యారెళ్ల చమురు ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. భారత్ వంటి దేశాలు తమ చమురు అవసరాల కోసం ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడతాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో సాధారణ స్థితి పునరుద్ధరించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది.












Click it and Unblock the Notifications